కమలాపూర్, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోటేబాయ్ రేవంత్‌రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బడేబాయ్ నరేంద్రమోదీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. సోమవారం బత్తినివానిపల్లి హనుమాన్ ఆలయంలో పూజలు చేసి గోపాల్పూర్, శనిగరం గ్రామాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడంతో ప్రజలు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాలేదన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదని, 2014 లో తాను ఎంపీగా గెలిచి రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్ స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్, రూ.50కోట్లతో కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం, జాతీయ రహదారులు తీసుకువచ్చానని, పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించేందుకు తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే జోడెద్దుల్లాగా పనిచేస్తామన్నారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల దొంగ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అనంతరం రామక్క పాటకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి-శాలినిరెడ్డి దంపతులు, వినోద్‌కుమార్ కోడలు హర్షిణి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీ లాండిగ కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, రంజిత్‌రెడ్డి, గోపాల్, రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.