వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు గ్రహణం పట్టింది. నిధుల లేమితో భూసేకరణ జరగక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం రోడ్డులోని ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డు మీదుగా ఎనుమాముల మార్కెట్ వరకు సుమారు 8 కి.మీ. మేర 200 అడుగుల వెడల్పుతో ఐఆర్ఆర్ నిర్మాణాన్ని చేపట్టింది. 2022-23లో రూ.50కోట్లతో ఐఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టర్‌కు కేటాయించింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఈ పనులను పర్యవేక్షిస్తున్నది. కొద్దినెలల క్రితం మొదలైన పనులు 1/300 కిమీ నుంచి 4/700 కిమీ మధ్యలో జరిగాయి.
నిర్దేశిత పనుల్లో 35 శాతం వరకు పూర్తి కాగా, తమకు పరిహారం చెల్లించకుండా పనులు చేయొద్దని భూనిర్వాసితులు అడ్డుకోవడంతో రెండు నెలల క్రితం నిలిచిపోయాయి. నెల రోజుల క్రితం వరంగల్‌కు వచ్చిన సీఎం సీఎం రేవంత్‌రెడ్డి ఐఆర్ఆర్పై స్వయంగా సమీక్ష జరిపినా పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికే పరిహారం కోసం రోడ్డెక్కిన భూనిర్వాసితులు ఆందోళనను తీవ్రం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
– వరంగల్, జూలై 28 (నమస్తే తెలంగాణ)
తొలిదశలోని 8 కి.మీ. ఐఆర్ఆర్ నిర్మాణం కోసం సుమారు 125 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంద ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఖిలావరంగల్ మండలంలోని తిమ్మాపూర్, ఖిలావరంగల్, ఉర్సు, గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, వరంగల్ మండలంలోని ఎనుమాముల రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తిమ్మాపూర్, ఖిలావరంగల్, ఉర్సు రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 78 ఎకరాలను సేకరిం చి, అవార్డ్ కూడా పాస్ చేశారు.
భూములు కోల్పోయి న వారిలో పలువురికి ప్రభుత్వం రూ.113.25 కోట్ల పరిహారం అందజేసింది. ఇంకా కొందరికి పంపిణీ చేయాల్సి ఉందని తెలిసింది. దీంతోపాటు గొర్రెకుంట, ఎనుమాముల రెవెన్యూ గ్రామాల పరిధిలో మరో 47 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇందుకోసం రూ.132 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. 47 ఎకరాల భూసేకరణకు సర్వే పూర్తి చేసి అవార్డ్ పాస్ చేసే కసరత్తు కూడా చేపట్టారు. తీరా నిధులు లేకపోవడంతో భూసేకరణ పనులు ముందు కు సాగడం లేదు. కుడా ఈ నిధులను కేటాయించాల్సి ఉంది. నిధులు ఇవ్వకపోతే భూసేకరణలో ముందుకెళ్లలేమని, ఇప్పటికే పరిహారం అందని రైతులు తమపై ఒత్తిడి తెస్తున్నారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం.
దీంతో ఐఆర్ఆర్ నిర్మా ణం కోసం జరగాల్సిన భూసేకరణ ఆగిపోయింది. ప్రధానంగా ఇప్పటికే ఐఆర్ఆర్ కోసం సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందని బాధితులు పలుమా ర్లు కలెక్టర్, వరంగల్ ఆర్డీవోతోపాటు మంత్రులను కలిశారు. ఐఆర్ఆర్ భూ బాధితుల సమాఖ్య పేరుతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే కార్యాచర ణ ప్రకటిస్తామని సమాఖ్య అధ్యక్షుడు దయాకర్ చెప్పారు.
జూన్ 29న జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఐఆర్ఆర్ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కలెక్టర్‌తోపాటు కుడా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐఆర్ఆర్ పనుల పురోగతిని వివరించారు. భూసేకరణ సహా నర్సంపేట రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ఐఆర్ఆర్ కోసం మరో రూ.150 కోట్లు అవసరమని సీఎంకు చెప్పారు.ఆ తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఐఆర్ఆర్ పనులపై అధికారులతో చర్చించారు. మంత్రి కొండా సురేఖ కూడా ఐఆర్ఆర్ పనులను పూర్తి చేయడంపై రెవెన్యూ, కుడా అధికారులతో మాట్లాడారు. అయినా, ఐఆర్ఆర్ నిర్మాణ పనుల పురోగతిలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ క్రమంలో భూములు కోల్పోయిన రైతులు తాజాగా ఆందోళనకు రెడీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.