హనుమకొండ, సెప్టెంబర్ 26 : విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని ఆర్జేడీ అజ్మీర గోపాల్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్)లో ఆర్.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు కళాశాలకు సరైన సమయానికి హాజరయ్యే విధంగాచూడాలన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేకమైన ఎంసెట్, నీట్,జెఈఈ, తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల కఠినంగా ఉండకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించి వారు చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా సహకరించాలని ,అధ్యాపకులు సూచనలు, సలహాలు పాటించాలన్నారు.
సమావేశంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నూతనంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బాధ్యతలు స్వీకరించిన ఏ.గోపాల్‌ను ప్రిన్సిపల్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కె.శ్రీధర్, కె.శ్రీదేవి, జ్యోతిర్మయి, సాంబశివయ్య, సంధ్యారాణి, ప్రసాద్, రేవతి, సుమన్, చిరంజీవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్‌కుమార్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.