వరంగల్/వరంగల్ చౌరస్తా/నయీంనగర్, అక్టోబర్31 : వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్‌రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేదని లోతట్టు ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పోలీసులు, అధికారుల ఆర్భాటమే కనిపించిందని వాపోయారు. పోతన నగర్లో కేవలం నాలుగు నిమిషాలే ఉన్నారని, రంగంపేటలో ఆగకుండా వెళ్లిపోవడంతో వరద బాధితులు నిరుత్సాహానికి గురయ్యారు. పోతన నగర్ పరిశీలనకు మంత్రి సురేఖ వెళ్లకుండా సీఎం తిరిగి వచ్చే వరకు కారులోనే ఉండడం గమనార్హం.
ముంపు బాధితుల గోడు వినకుండానే సీఎం రేవంత్‌రెడ్డి వెనుదిరిగారు. పోతన నగర్లో ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఆయన అక్కడి వరద ప్రభావిత కుటుంబాలతో మా ట్లాడకుండానే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రికి తమ గోడును చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా పట్టించుకోలేదు. అధికారులు చెప్పిందే వింటూ ముందుకెళ్లారు. సీఎం పర్యటనతో తమ కాలనీ రాత మారుతుందని గంపెడాశలు పెట్టుకున్న వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 04.02 గంటలకు పోతన నగర్‌కు చేరుకున్న సీఎం కాన్వాయ్ 04.06 గంటలకు తిరుగుముఖం పట్టింది. ఈ నాలుగు నిమిషాల్లో అక్కడి నాలాతో పాటు ఏరియల్ మ్యాప్‌ను పరిశీలించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీఎంకు కాలనీ ముంపు పరిస్థితిని వివరించారు. క్షేత్రస్థాయిలో నాలాను పరిశీలించేందుకు మాత్రమే ఆయ న అక్కడికి వచ్చినట్టుగా పర్యటన సాగింది.
వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమ్మయ్యనగర్ వద్ద మున్సిపల్ కార్మికులు విజ్ఞప్తి చేయగా.. ‘ఇది గవర్నమెంట్ పని కదా అమ్మ చూద్దాం’ అంటూ దాటవేశారు. మీ సమస్యలన్నీ మంత్రి పొంగులేటి చూస్తారు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తాత్కాలికంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం వరదలు వచ్చాయని, గురువారం ఇబ్బందులు పడ్డామని… రెండురోజులు పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి వస్తున్నారనే మెడికల్ క్యాంపు పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
వరంగల్ నగరంలోని పోతన నగర్, సమ్మయ్యనగర్, రంగంపేట ప్రాంతాల్లో సీఎం పర్యటన ఉంటుందని అధికారులు షెడ్యూల్లో ప్రకటించారు. ఐతే కాపువాడ మీదుగా రంగంపేటకు చేరుకున్న సీఎం కాన్వాయ్ అక్కడ ఆగకుండానే వెళ్లిపోయింది. ఆయన వాహనం నుంచే భద్రకాళి చెరువు మత్తడిని పరిశీలించా రు. దీంతో అక్కడ వేచి ఉన్న అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారులోనే ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చిన మంత్రి కొండా సురేఖ పోతన నగర్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లలేదు. సీఎం వచ్చే వరకు కారులోనే ఉండడం గమనార్హం.