మహబూబాబాద్ రూరల్, మే 10 : పరిపాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం సోయి లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగానికి ప్రస్తుతం చెదలు పట్టిందన్నారు. కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలపాటు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని సముచిత స్థానం కల్పించారని, దీంతో మహిళలు హూందాగా, గౌరవంగా జీవించినట్లు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. మల్కాజిగిరి సీపీ, ఒక పోలీస్ అధికారిణి దిల్‌షుఖ్‌నగర్ ఏరియాలో అర్ధరాత్రి నిల్చుంటే రౌడీ మూకలు, పోకిరీలు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించారని, హైదరాబాద్ నడిబొడ్డున ఓ మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారని, పట్టపగలే కరీంనగర్లో ఓ బంగారం షాపులో దొంగలు పడి దోచుకున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న అవినీతిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్క చేస్తున్న అవినీతిపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్‌పై కేసులు పెట్టించి జైలుకు పంపినట్లు తెలిపారు.
జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రాంచంద్రూనాయక్, మురళీనాయక్ రక్షణపై దృష్టి పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాలు జరకుండా చర్యలు తీసుకుని, యువత భవిష్యత్‌ను కాపాడాలన్నారు. మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్రంలో హోంమంత్రి కీలకంగా పని చేయాలని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో హోంమంత్రి పదవిని సీఎం దగ్గర ఉంచుకొని రక్షణ లేకుండా చేస్తున్నారని అన్నారు. రాష్ర్టాన్ని మరో బిహార్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో విపరీతంగా క్రైమ్ రేటు పెరిగిపోతున్నదని, కేసీఆర్ కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిస్తే.., సీఎం రేవంత్‌రెడ్డి ఇంతవరకు అందులో కూర్చొని నేరాలపై రివ్యూ చేయలేదన్నారు.
కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో స్వయానా బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టలేదని, మోదీని కలుస్తామంటే చివరకు పోక్సో కేసు నమోదు చేశారని అన్నారు. మహిళలను గౌరవించని బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. మహిళల హక్కులు, వారి రక్షణకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, భూక్యా బుజ్జీ, పద్మ, శ్రీదేవి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్న, మహబూబ్ పాషా, మార్నేని రఘు, లింగన్న పాల్గొన్నారు.