జయశంకర్ భూపాలపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కంచె చేను మేసిన చందంగా మారింది భూపాలపల్లిలో అటవీశాఖ పరిస్థితి. ఆ శాఖ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకునే అధికారులు సొంత భవనానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటవీశాఖ భవన నిర్మాణాలకు రిజర్వ్ ఫారెస్టు ఇసుకను వాడేందుకు అడ్డు చెప్పని ఆ శాఖ అధికారులు కాల్వపల్లి ఇసుక ట్రాక్టర్లను మాత్రం సీజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అటవీ శాఖ ని ర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిబంధనలను తుంగలో తొక్కి స్థానిక ఇసుకను వినియోగిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. లోకల్ ఇసుక, కాల్వపల్లి ఇసుక పక్క పక్కనే దర్శనమిస్తూ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ అక్రమాలను ఎత్తి చూపుతున్నాయి. ఇదేంటని పలువురు కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే ఆ ఇసుక అడుగు భాగంలో పోసేందుకు వాడుతున్నానని దాటవేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అటవీ అధికారుల రూటే సఫ‘రేటు’పై సర్వత్రా చర్చనీయంగా మారింది.
భూపాలపల్లి అటవీశాఖ కార్యాలయంలో స్వయంగా డీఎఫ్‌వో కార్యాలయం ముందే సీనియర్ ఆఫీసర్స్ క్యాంప్ ఆఫీస్ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2025 జనవరి 26న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (కంపా) డాక్టర్ సీ సువర్ణ పనులకు శిలాఫలకం వేసి సుమారు రూ.40 లక్షలతో ప్రారంభించారు. ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్‌వో నవీన్, ఫారెస్టు రేంజ్ అధికారి నరేశ్ బసవ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ఆ పనుల్లో నిర్లక్ష్యం కళ్ల ముందే కనిపిస్తున్నది.
గతంలో 2017 డిసెంబర్ 26న ఉడెన్ గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులను అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పీకే ఝా ప్రారంభించారు. నిర్మించిన ఆదిలోనే ఉడెన్ హౌస్ చెదలు పట్టి చెడిపోగా దాని స్థానంలో మళ్లీ ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యాలయ నిర్మాణ పనులు సైతం అదే తరహా నిర్లక్ష్యంతో సాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చేసిన తప్పిదమే అధికారులు మళ్లీ చేస్తున్నారని, పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని అటవీశాఖకు చెందిన పలువురు సిబ్బందే చెప్పుకోవడం గమనార్హం.