Research students | హనుమకొండ చౌరస్తా, జూన్ 28: కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గతంలో ఉన్న ఫీజు పెంపుతో విద్యార్థులపై అదనపు భారం పడుతుందని ఏకపక్షంగా ఫీజును పెంచి విద్యార్థులపై భారం మోపడం సమంజసం కాదని, పెంచిన ఫీజును తగ్గించి పాత ఫీజునే కొనసాగించాలని, విద్యార్థులపై ఫీజుల భారం మోపడం ఏంటని ప్రశ్నించారు. చాలామంది విద్యార్థులు ఫీజులు కట్టలేని దుస్థితిలో ఉన్నారని, గతంలో ఫీజు తగ్గించాలని వీసీకి వినతిపత్రం ఇచ్చిన ఇప్పటివరకు స్పందనే లేదన్నారు.
ప్రభుత్వం, యూనివర్సిటీ నుంచి ఎలాంటి సహాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఫీజులు పెంచి విద్యార్థులపై భారం వేయడం అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు. పెంచిన రెన్యువల్ ఫీజులు వెంటనే తగ్గించి ఫీజు చెల్లింపు తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేయూ పరిశోధక విద్యార్థులు బొచ్చు తిరుపతి, అంకెల శంకర్, దొగ్గెల తిరుపతి, కలకోట్ల సుమన్, కందికొండ తిరుపతి, స్వామి, రాజారాంల పాల్గొన్నారు.