ములుగు, జయశంకర్ జిల్లాల్లో వరద ప్రభావం
పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు
ములుగులో 37 సెంటర్లకు.. 4049మంది
భూపాలపల్లిలో 20 కేంద్రాల్లో 2250 మంది
భోజనం, ఇతర సామగ్రి అందజేత
వైద్య బృందాలతో పరీక్షలు, మందుల పంపిణీ
రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాలకు నిత్యావసరాల చేరవేత
హనుమకొండ, జూలై 14 : భారీ వర్షాలు కురిసినా గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో పరిస్థితులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జడ్పీ చైర్మన్లు, పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ప్రభుత్వ శాఖల అధికారులతో హనుమకొండ, జనగామ కలెక్టరేట్లలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సర్కారు ఆదేశాల మేరకు జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు చాలా బాగా పని చేశారని అభినందించారు. ఇక ముందు కూడా అప్రమ త్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఏటూరునాగారంలోని నీట మునిగిన లోతట్టు ప్రాంతం
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, జూలై14(నమస్తేతెలంగాణ) : వరుస వానలు ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని ముంపు ప్రాంత ప్రజలను అతలాకుతలం చేశాయి. వరదలో చిక్కుకున్న గ్రామాలను అధికార యంత్రాంగం దాదాపుగా ఖాళీ చేయించింది. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు రంగంలోకి దిగి ములుగు జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4049 మందిని , భూపాలపల్లిలో 20 సెంటర్లు పెట్టి 2250 మందిని వాటిలోకి తరలించాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లోనే తలమునకలై ఉన్నాయి. వాగులు, లో లెవల్ వంతెనలు తెగిన ప్రాంతాల నుంచి ప్రజలను, ముఖ్యంగా గర్భిణులను సమీప దవాఖానలకు చేరవేస్తున్నాయి. ఇటు వైద్యాధికారులు, సిబ్బంది సైతం వరదను లెక్కచేయకుండా వాగులు దాటి వస్తూ వైద్య సేవల్లో నిమగ్నమవుతున్నారు.
కాటారం : వరద బాధితులకు భోజనం వడ్డిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్
ములుగు జిల్లాలో వరద బాధితుల కోసం ప్రభుత్వం 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. కలెక్టర్ కృష్ణఆదిత్య ఆధ్వర్యంలో వెంకటాపూర్‌లో 3, గోవిందరావుపేటలో 9, తాడ్వాయిలో 1, ఏటూరునాగారంలో 4, వాజేడులో 5, కన్నాయిగూడెంలో 4, వెంకటాపురం(నూగూరు)లో 3, మంగపేట మండలంలో 8 పునరావాస కేంద్రాలను ప్రభుత్వ, ట్రైబల్వెల్ఫేర్ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లలోనూ బాధితులకు వసతి, భోజన సౌకర్యం కల్పించారు. గురువారం వరకు 1616 మంది పురుషులు, 1984మంది స్త్రీలు, 449మంది చిన్నారులకు వసతి కల్పించారు.
మంగపేట, ఏటూరునాగారం, వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం(నూగూరు) మండలాల్లో గోదావరి వరదతో ముంపునకు గురైన 25 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, రాజన్నపేట, లక్ష్మీపురం, తుపాకులగూడెం, వాజేడు మండలం ఎడ్జర్లపల్లి, ఏటూరునాగారం మండలం అల్లంవారి ఘనపురం, వెంకటాపురం(నూగూరు) మండలం తిప్పాపురం, అలుబాక, పాత్రపురం, ఉప్పేడు వీరభద్రాపురం, మంగపేట మండలం కమలాపురం, రాంనగర్, తాడ్వాయి మండలం బందాల, లింగాల, నార్లాపూర్, కాల్వపల్లి, ఊరట్టం, వెంకటాపురం మండలం బూర్గుపేట, లింగాపురం, గోవిందరావుపేట మండలం సోమలగడ్డ, రంగాపురం గ్రామాలకు రోడ్లు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా గోవిందరావుపేట మండలంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూడు పశువులు చనిపోయాయి. పరిస్థితులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతితో పూస్కుపల్లి, కుంట్లం, పలుగుల, అన్నారం మద్దులపల్లి, పలిమెల మండలం లెంకలగడ్డ, పంకెన, పలిమెల, సర్వాయిపేట గ్రామాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. స్థానిక పోలీస్ స్టేషన్‌ను వరద చుట్టుముట్టింది. కాటారం మండలంలో మానేరు, పెద్దవాగుల ప్రవాహం, గోదావరి బ్యాక్ వాటర్‌తో దామెరకుంట, లక్ష్మీపురం, గుండ్రాత్‌పల్లి, మల్లారం గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది. దామెరకుంట, లక్ష్మీపూర్ గ్రామాల ప్రజలకు గంగారం మోడల్ సూల్లో పునరావాసం కల్పించారు.
భయంకరంగా గోదావరి 1986 నాటి పరిస్థితులు
కాళేశ్వరం/ కన్నాయిగూడెం/ వాజేడు/ ఏటూరునాగారం,జూలై 14 : గోదావరి భయంకరంగా పరవళ్లు తొక్కుతున్నది. ప్రాణహితతో పాటు అన్నారం (సరస్వతీ) బరాజ్ నుంచి భారీగా వరద పోటెత్తుతున్నది. త్రివేణీ సంగమం నుంచి 27.88లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వైపు పరుగులు తీసున్నది. లక్ష్మీ బరాజ్ 85 గేట్ల ఎత్తి 27,88,050 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 1986లో సుమారు 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని, నది పూర్తి ప్రవాహ సామర్థ్యం 28లక్షల క్యూసెక్కుల వరకు ఉంటుందని, ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రవహించే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ వరద రావడంతో కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి నీరు చేరింది.
సమ్మక్క బరాజ్ వద్ద
కనాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి 92.2 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. బరాజ్ పరిసరాలను వరద చుట్టుముట్టడంతో అక్కడివారంతా బయటకు వచ్చేశారు. బరాజ్ పిల్లర్ పూర్తి ఎత్తు 98.5 మీటర్లు ఉంటుంది. 92 మీటర్ల ఎత్తులో స్లాబ్ లెవల్ ఉండడంతో గేట్లను సైతం అంతే ఎత్తులో ఉంచారు. ఒక్క మీటర్ ఎత్తు పెరిగినా ఆక్కడి ప్రదేశమంతా జలమయమవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
వాజేడులో పూసూరు బ్రిడ్జిని ఆనుకొని..
వాజేడు మండలం పేరూరు, వాజేడు, పూసూరు వద్ద గోదావరి గంట గంటకూ పెరుగుతూ రహదారులపై నుంచి ప్రవహిస్తున్నది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు 18.430 మీటర్ల(60) ఎత్తులో పూసూరు బ్రిడ్జిని తాకుతూ పరవళ్లు తొక్కుతున్నది. బ్రిడ్జి సమీపంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్ సమీపం వరకు వరద చేరింది.
ఏటూరునాగారం సగం ఖాళీ
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ 18మీటర్ల ఎత్తులో పొంగుతున్నది. 1986,1990లో గోదావరి వరదలతో ఏటూరునాగారం నిండా మునిగింది. వందలాది ఇండ్లు నేల మట్టమయ్యాయి. ఆ స్థాయిలో మళ్లీ ఇప్పుడు వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 1986, 90 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గోదావరి, జంపన్నవాగు చుట్టూ కరకట్ట నిర్మించడంతో ఏటూరునాగారానికి వరద ముప్పు తప్పింది. కానీ, ఈ సారి వచ్చిన వరదలు ఏటూరునాగారం మండల కేంద్రాన్ని ముంచుతున్నాయి. ఇప్పటికే సగానికిపైగా గ్రామం ఖాళీ అయింది. కరకట్ట తూముల నుంచి గ్రామంలోకి వరద పోటెత్తింది. ఊరిని మూడు వైపుల నుంచి చుట్టుముట్టింది. వరద ముంపు కారణంగా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరకట్ట లేకుంటే గ్రామం నామరూపాలు లేకుండా పోయేదని గ్రామస్తులు అంటున్నారు.