ఖిలా వరంగల్ : చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఫలితంగా సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని(Dried crops) ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు. ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని, అలాగే దేవాదుల ద్వారా సాగునీటిని అందించాలని కోరుతూ అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట, చెన్నారం, వర్ధన్నపేట మండలం చెన్నారం, సంగెం మండలంలోని ఆశాలపల్లి, కాపుల కనిపర్తి, కాట్రపల్లి, వెంకటాపురం, గవిచర్ల, గుంటూరుపల్లి, రామచంద్రాపురం, లోహిత, తీగరాజుపల్లి గ్రామాల్లో సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 15 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించేందుకు ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపేందుకు డీ-8 కాల్వను నిర్మించారన్నారు.
అయితే నిర్మాణం పూర్తయినప్పటి నుంచి నేటి వరకు కాల్వలో చుక్క నీరు రాలేదన్నారు. అలాగే కాల్వలో చెట్లు పెరగడం వల్ల శిథిలావస్థకు చేరుకుందన్నారు. కాల్వను శుభ్రం చేసి పంటలకు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి మొక్కజొన్నకు ఎకరానికి రూ.40 వేలు, వరికి రూ.50 వేలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి కే బాబురావు, నాయకులు గోనె రామచందర్, మంద రవి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.