వరంగల్ చౌరస్తా: నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33 ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 35శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టి, రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డికి నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానిక విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని, నీట్ అర్హతలు సాధించినా స్థానిక కోటాలో తగిన న్యాయం జరగడం లేదని అన్నారు.
వైద్య విద్యను స్థానిక విద్యార్థులకు దూరం చేయవద్దని యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సమస్యను వివరించి, జీవో 33ను త్వరలో నిర్వహించబోయే మెడికల్ కౌన్సిలింగ్లో అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై త్వరలోనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని అన్నారు.