కాజీపేట, మార్చి 30 : కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదా కల్పించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు వినతి పత్రం సమర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు కాజీపేట రైల్వే డివిజన్ స్థాయి పెంపు కోసం ఉన్న వనరులను వివరించారు. ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ్య ద్వా రంగా, సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లోనే రెండో అతిపెద్ద స్టేషన్‌గా కాజీపేట జంక్షన్ ఉందన్నారు.
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో బొగ్గు, సిమెంట్, గ్రానైట్, సున్నపురాయి తదితర వాణిజ్య రవాణాతో సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు కాజీపేట నుంచి అన్ని విధాలా అధిక ఆర్ధిక రా బడి వస్తున్నదని తెలిపారు. విజయవాడ సెక్షన్లో, కాజీపేట నుంచి మధిర, మణుగూరు, జగ్గయ్యపేట వరకు, బలార్ష రైల్వే సెక్షన్లో కాజీపేట నుంచి మణిఘర్, ఫండర్ఫాణి, ఎల్ఎన్టీ సైడింగ్, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు, సికింద్రాబాద్ సెక్షన్లో కాజీపేట నుంచి ఆలేర్ వరకు కావాల్సిన విశాల రైల్వే విస్తీర్ణం ఉందన్నారు.
కాజీపేటలో విశాల భూమి, నీటి, రోడ్డు, రైలు రవాణా, పలు షెడ్లు, వివిధ రకాల రైల్వే డిపోలు తదితర వసతులున్నాయన్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరుకు అప్పటి సీమాంధ్ర పాలకులు, రైల్వే అధికారులు రైల్వే డివిజన్ హోదా కల్పించారని తెలిపారు. గతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లుండేవని, ఏపీ పునర్విభజనలో భాగంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను వేరుచేసి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్ట్ రైల్వే జోన్‌గా ఏర్పాటు చేశారన్నారు.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉన్నాయని, ప్రతి రైల్వే జోన్ కు తప్పనిసరిగా నాలుగు డివిజన్లు అవసరమని వివరించారు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలతో పాటు రైల్వే బోర్డుపై ఓత్తిడి పెంచి అన్ని అర్హతలున్న కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా సాధనకు సహాయ, సహకారాలందించాలని కోరా రు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ రైల్వే డివిజన్ హోదా కోసం తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివా స్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ యూనియన్ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్, నాయకులు యుగేంధర్ యాదవ్, డాక్టర్ దాడబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.