హనుమకొండ చౌరస్తా, మే 24: హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు సిద్ధమైంది. ఈనెల 25 నుంచి 27 వరకు న్యాక్ బృందం కేయూను సందర్శించనుంది. బృం దం పర్యటనకు వర్సిటీ అధికారులు సమాయత్తమయ్యారు. 12 సెప్టెంబర్ 2017న నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు పొందింది. కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 650 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం విస్తరించి ఉంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో పచ్చని అందమైన ఉద్యానవనం ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యను కూడా అందిస్తుంది. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఉపయోగం కోసం బ్యాంకు, పోస్టాఫీస్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కళలు, సైన్స్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సోషల్ ఫ్యాకల్టీలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో సుమారు 120 ప్రోగ్రామ్‌లను కేయూ అందిస్తున్నది. కాకతీయ విశ్వవిద్యాలయంలో సుమారు 5 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్మినెంట్, కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగులు మొత్తం 273 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. యూనివర్సిటీలో 28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్యాంపస్ ఆవరణలో ఫలహారశాల, వసతిగృహం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వైద్య, క్రీడామైదానం అందుబాటులో ఉన్నాయి.
రూ.8 కోట్లతో పునర్నిర్మాణ పనులు..
న్యాక్ బృందం పర్యటనలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి తుదిమెరుగులు దిద్దారు. రూ.8 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన భవనాలకు రంగులు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూర్చారు. వర్సిటీలోని ప్రతి విభాగాన్ని అందంగా ముస్తాబు చేసి భవనాలకు కొత్త రూపు తీసుకొచ్చారు. మొక్కలు, గార్డెనింగ్‌తో యూనివర్సిటీలోని ప్రతివిభాగాన్ని అందంగా తీర్చిదిద్దారు.
ఏడుగురితో కూడిన న్యాక్ బృందం
ఏడుగురితో కూడిన న్యాక్ బృందం కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనుంది. ఒకరు ఛైర్మన్, మెంబర్ కోఆర్డినేటర్, ఇతర సభ్యులతో కూడిన బృందం క్యాంపస్‌ను పరిశీలించనుంది. కొన్ని నెలలుగా వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్‌తో పాటు వర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు న్యాక్ కోసం సన్నద్ధం అవుతున్నారు. వీసీ సమయం వెచ్చిస్తూ అధ్యాపకులను ఆ దిశగానే నడిపిస్తూ వస్తున్నారు. న్యాక్ బృందం కాకతీయ విశ్వవిద్యాలయంలో పర్యటించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విభాగాల్లో ముందుగానే రిహార్సల్స్ పూర్తి చేశారు. ప్రతి విభాగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఫ్యూచర్ ప్లాన్స్, తెలియజేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. .
కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ ప్లస్ సాధిస్తుంది
కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ బృందం పర్యటనకు సమాయత్తమైంది. కాకతీయ విశ్వవిద్యాలయానికి 2017లో ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. ఈసారి విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధిస్తుంది. రూ.8 కోట్లతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశాం. కేయూలో చేపట్టే కోర్సులు, భవిష్యత్ ప్లాన్‌ను సిద్ధం చేశాం. న్యాక్ బృందం పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
-ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కేయూ వైస్‌ఛాన్సలర్