నర్సంపేట రూరల్, ఆగస్టు 5 : ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రూ.61కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు రూ.61 కోట్ల పంట నష్టపరిహారం విడుదల కాగా ఒక్క నర్సంపేటకే రూ.42 కోట్ల పరిహారం విడుదలైనట్లు పేర్కొన్నారు. గతంలో నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా సందర్శించడానికి వచ్చినప్పుడు నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.10 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు సీఎం కేసీఆర్ కట్టుబడి పంట నష్ట పరిహారాన్ని విడుదల చేసినట్లు తెలిపారు.
నిజమైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆరే అని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి సీఎం చేసిన మేలును తన జీవితంలో ఎన్నటికీ మరువలేనిదని తెలిపారు. అంతేగాక 2022లో కురిసిన భారీ వర్షాలకు నర్సంపేటలో నష్టపోయిన రైతులకు కూడా ప్రత్యేక జీవో ద్వారా రూ.14కోట్ల నిధులు విడుదల చేయగా, వాటిని విడుతల వారీగా రైతులకు అందజేసినట్లు తెలిపారు. మరో వారం, పది రోజుల్లో నష్టపరిహార చెల్లింపుల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, సంబంధిత అధికారులను ఎమ్మెల్యే పెద్ది కోరారు. ముఖ్యంగా పంట నష్టపరిహారం నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.