దేవరుప్పుల, మే10 : కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి అసమ్మతి వర్గం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఆమె విధానాలు నచ్చని అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్ష పదవికి శనివారం నామినేషన్ల పర్వం ముగియగా, 16 మంది బరిలో నిలిచారని తెలిసింది. ఝాన్సీరెడ్డిపై తిరుగుబాటు చేసిన మండలంలోని సింగరాజుపల్లికి చెందిన ఇప్ప పృథ్వీరెడ్డి శనివారం మండల అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు నామినేషన్లు దాఖలు చేశాయని తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మండల అధ్యక్ష పదవిలో ఉన్న పెద్ది కృష్ణమూర్తి అనంతర పరిణామాల్లో ఝాన్సీరెడ్డితో పోసగ లేదు. దీంతో కృష్ణమూర్తి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వందలాది మందితో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి ఝూన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించి పార్టీ పెద్దలకు పరిస్థితిని వివరించాడు. దీంతో ఇరువురి మధ్య మరింత దూరం పెరిగింది.
ఈ క్రమంలో పెద్ది కృష్ణమూర్తిని పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి ఝాన్సీరెడ్డి తప్పించి నల్ల శ్రీరాంకు కట్టబెట్టింది. తనకు తలనొప్పిగా మారిన పెద్ది కృష్ణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. మరోవైపు తెలంగాణ విద్యార్ధి ఉద్యమకారుడు, ఉస్మానియా జేఏసీ నేత సింగరాజుపల్లికి చెందిన ఇప్ప పృథ్వీరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినీరెడ్డి గెలుపు కోసం శ్రమించారు. ఝాన్సీరెడ్డి విధానాలు నచ్చకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండడంతో రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.