రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినాదినాభివృద్ధి చెందుతున్న ‘గ్రేటర్ వరంగల్’లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికలతో ఓరుగల్లును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి రోజురోజుకూ విస్తరిస్తున్నది. నగరం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తుండడం, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణం, ఎడ్యుకేషనల్, హెల్త్, టెంపుల్స్, టూరిజం హబ్‌గా అవతరించడం, త్వరలో మామునూరు ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి రానుండడంతో గ్రేటర్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే నగర నడిబొడ్డున, నగరం చుట్టూరా కుడాతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన వెంచర్లు విజయవంతమయ్యాయి.
– వరంగల్, నవంబర్ 22
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నది. రాష్ట్ర సర్కారు చొరవతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక విజన్‌తో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి అమలు చేస్తున్నది. దీంతో నగరంలోనే కాకుండా శివారు గ్రామాల చుట్టూ రియల్ బూమ్ నడుస్తోంది. ఇప్పటికే నగర నడిబొడ్డున, నగరం చుట్టూ కుడాతో పాటు ప్రైవేట్ సంస్థలు వేసిన అనేక రియల్ వెంచర్లు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ నగరం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేరాఫ్‌గా మారింది.
రింగ్‌రోడ్లతో రియల్ బూమ్
నగరం చుట్టూ ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో వరంగల్‌లో రియల్ వ్యాపారం ఊపందుకుంది. రింగ్ రోడ్ల ప్రణాళికలతో రవాణా వ్యవస్థ మెరుగైంది. జాతీయ రహదారుల అనుసంధానం వరంగల్ నగరం చుట్టూ రియల్ వ్యాపారానికి ఊతమిచ్చింది. రింగ్ రోడ్ల అభివృద్ధితో వరంగల్ నగరంలో అంతర్జాతీయ మార్కెట్ విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారితో ఔటర్ రింగ్‌రోడ్డును అనుసంధానం చేస్తూ ప్రణాళికలు చేయడంతో రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు పట్టణీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. దీంతో అయా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. దీనికి తోడు జగిత్యాల నుంచి కోదాడను కలిపే మరో జాతీయ రహదారి వరంగల్ మీదుగా వెళ్తుండడంతో నగరం నలువైపులా రియల్ వ్యాపారానికి మరింత ఊపు వచ్చింది.
ములుగు వైపు భూపాలపట్నం జాతీయ రహదారి, జగిత్యాల నుంచి కోదాడ కలిపే జాతీయ రహదారితో ఖమ్మం వైపు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు మామునూరు వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడంతో వరంగల్‌లో రియల్ వ్యాపారం బంగారంలా మారుతున్నది. ఇప్పటికే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని నగరం మధ్య నుంచి చేపడుతుండడంతో నగర భూములు హాట్ కేకుల్లా మారాయి. ఎడ్యుకేషన్, హెల్త్, టెంపుల్స్, టూరిజం, ఐటీ హబ్‌గా ఎదుగుతున్న వరంగల్ నగరం రియల్ వ్యాపారానికి కలిసి వస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇంటి స్థలం కొనాలనుకునేవారు ఇప్పుడు వరంగల్‌లో ఇంటి స్థలం కావాలనుకుంటున్నారు.
ప్రభుత్వ పక్కా ప్రణాళికలతో నగర అభివృద్ధి
వరంగల్ నగరాన్ని పక్కా ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ప్రత్యేక విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి అమలు చేస్తున్నది. మాస్టర్ ప్లాన్‌లో రింగ్ రోడ్ల చుట్టూ కమర్షియల్ జోన్‌గా నిర్ణయించారు. రింగ్ రోడ్లతో కాబోయే అభివృద్ధిని ఊహించి అధికార యంత్రాంగం ఓఆర్ఆర్ చుట్టూ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు వచ్చేలా మాస్టర్‌ప్లాన్‌లో పొందు పర్చారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించే టెక్స్టైల్ పార్క్ పనులు వేగంగా కొనసాగుతున్న తరుణంలో వరంగల్ నగరం అంతర్జాతీయ మార్కెట్ చిత్రపటంలో నిలువనుంది. ఇప్పటివరకు నగర నడిబొడ్డున మాత్రమే విస్తరించిన మార్కెట్ వ్యవస్థ, ఇప్పుడు శివారు గ్రామాలకు పరుగులు పెట్ట డం ఖాయంగా కనిపిస్తోంది. చారిత్రక వరంగల్ నగరం చుట్టూ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ రోడ్లతో వాణిజ్యప రంగా వరంగల్, హనుమకొండ నగరాలు సరికొత్తగా అవతరించనున్నాయి.
రియల్ ఎస్టేట్‌పై ఆశలు
వరంగల్ నగరంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చేపట్టిన వెంచర్లకు వచ్చిన ఆదరణ చూస్తే రియల్ ఎస్టేట్ రంగానికి వరంగల్ కేరాఫ్‌గా కనిపిస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రియ ల్ వ్యాపారానికి డిమాండ్ కనిపిస్తోంది. నగరం మధ్యలో ఓ సిటీ, నగర శివారులో మా సిటీ పేరిట కుడా చేసిన వెంచర్లకు విశేష ఆదరణ వచ్చింది. ఊహించని విధంగా ధరలు పలికాయి. దీంతో పాటు వరంగల్ నగర శివారులో ప్రైవేట్ సంస్థలు చేస్తున్న వెంచర్లు సక్సెస్ అవుతున్నాయి. దీంతో వరంగల్ సంస్థలే కాకుండా హైదరాబాద్‌కు చెంది న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా వరంగ ల్ ప్రాంతంలో వెంచర్ల కోసం ముందుకొ స్తున్నాయి.
రియల్ ఎస్టేట్‌కు మంచి ఆదరణ
హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో రియల్ ఎస్టేట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం హబ్‌గా ఎదుగుతున్న క్రమంలో చాలామంది ఇటువైపే చూస్తున్నారు. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరం చుట్టూ జాతీయ రహదారులు, అనుసంధానంగా రింగ్ రోడ్లు ఉన్నాయి. దీంతో వరంగల్ నగరం రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో అనువైన ప్రాంతంగా రియల్టర్లు భావిస్తున్నారు.
– గోగుల లక్ష్మీవిజయ్కుమార్, ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్