రాయపర్తి : మండల కేంద్రంలో ప్రతీ గురువారం నిర్వహించే సంత బహిరంగ వేలం పాటను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ ప్రత్యేక అధికారి, తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, గ్రామపంచాయతీ కార్యదర్శి వల్లే వినోద్ కుమార్ ల సమక్షంలో నిర్వహించారు. అంగడి నిర్వహణను ఏడాది పాటు దక్కించుకోవడం కోసం పలు ప్రాంతాలకు చెందిన 80 మంది గుత్తేదారులు బహిరంగ వేలం పాటలో పోటీపడ్డారు. చివరకు వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్నాల భద్రాద్రియాదవ్ రాయపర్తి అంగడి నిర్వహణను రూ.3.96 లక్షలకు బహిరంగ వేలం పాటలో దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి ముల్కనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగడి వేలం పాటను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు గ్రామపంచాయతీకి సకాలంలో నిధులు జమ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే అంగడి నిర్వహణ కొనసాగించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కాంట్రాక్ట్ ను రద్దు చేసే అధికారం గ్రామపంచాయతీకి ఉంటుందన్నారు. కాగా రాయపర్తి అంగడి వేలం గతేడాది రూ.4.03 లక్షలకు ఖరారు కాగా ఈ ఏడాది రూ.07 వేలు తగ్గి రూ.03.96 లక్షలకు ఖరారైంది. ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ కారుపోతుల రామచంద్రయ్య, అంగడి కాంట్రాక్టర్లు తౌడిశెట్టి రామారావు, చిన్నాల ధనుంజయ, ఉపాసి వెంకట రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.