నర్సంపేట రూరల్, అక్టోబర్ 17 : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం కు అరుదైన గౌరవం లభించింది. ఆయన రూపొందించిన ప్రాజెక్టు ఆధారిత బోధన పద్ధతి న్యూఢిల్లీలోని జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) కి ఎంపికైంది.
ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీఎస్వీఎన్ మాధురి విలేకరులకు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వచ్చిన ప్రాజెక్టుల నుంచి ఉన్నత పాఠశాలల విభాగంలో ‘అకడమిక్ అచీవ్మెంట్ అండ్ ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ డిస్కోర్సెస్’ అనే ప్రాజెక్టును ఎన్సీఈఆర్టీ విద్యా విభాగం రెండు దశల్లో ఎంపిక చేసిందన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు వారానికి రెండు లేదా మూడు ప్రత్యేక తరగతుల్లో ప్రాజెక్టు ఆధారిత బోధన చేయాల్సి ఉంటుందన్నారు.
బోధన అంశాల రిపోర్ట్స్‌ను న్యూఢిల్లీలోని ఎన్సీఈఆర్టీ డిపార్ట్మెంట్ ఆ ఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (డీటీఈ) విభాగం పరిశీలన కోసం పంపించినట్లు వివరించారు. 2019-20 విద్యా సంవత్సరంలో సత్యం రూపొందించి, బోధించిన ‘ది యూజ్ ఆఫ్ ఐసీటీ ఇన్ ఈఎల్టీ’ ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థ యు నెస్కో నుంచి ప్రశంసలు లభించాయని మాధురి తెలిపారు. ఈ సందర్భంగా సత్యంను హెచ్ఎంతో పాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు.