సుబేదారి/గిర్మాజీపేట, అక్టోబర్ 12 : వరంగల్ కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం కలకలం రేపింది. పేరు మార్పిడి, ఇంటి నంబర్ కోసం రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వై హరీశ్‌కుమార్ కథనం ప్రకారం.. వరంగల్ మండిబజార్‌కు చెందిన సింగంశెట్టి లవన్‌కుమార్ తన తండ్రి నిర్మించిన ఇంటిని ఇటీవల తల్లి పేరుమీద గిఫ్ట్ డీడ్ చేయించాడు. రెండు పోర్షన్లలో ఒకటి లవన్‌కుమార్ వాటాకు వచ్చింది. పేరు మార్పిడి, కొత్త ఇంటి నంబర్ కోసం ఆయన కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎస్కే రబ్బాని, ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ ముప్పిడి రంజిత్‌ను సంప్రదించాడు.
వారు రూ.40 వేలు డిమాండ్ చేయగా రూ.35 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం లవన్‌కుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డీల్ ప్రకారం ముందుగా రూ.15 వేల నగదును ఇవ్వడానికి బాధితుడు లవన్‌కుమార్ బుధవారం 11 గంటలకు కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం సమీపం నుంచి రబ్బానీ, రంజిత్‌కు ఫోన్‌చేశాడు. వారు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత సర్కిల్ కార్యాలయంలోని వారి గదిలో సోదాలు చేసి, కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్కే రబ్బాని, రంజిత్ ఇళ్లల్లో సోదాలు
కొత్తవాడలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రబ్బానీ నివాసం, కొత్తపేటలోని బిల్ కలెక్టర్ రంజిత్ నివాసంలో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు తనిఖీలు జరిపారు. రబ్బానీ ఇంట్లో రూ.5 లక్షలకుపైగా నగదు లభ్యమైనట్లు తెలిసింది. ఏ-1 రబ్బాని, ఏ-2 రంజిత్‌ను అదుపులోకి తీసుకుని ఎంజీఎం దవాఖానలో వైద్య పరీక్షలు చేయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరుచనున్నట్లు పేర్కొన్నారు. సోదాల్లో వరంగల్ ఏసీబీ డీఎస్పీ హరీశ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీనివాస్, రవి , ఖమ్మం ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కలకలం
రెవెన్యూ ఇన్స్పెక్టర్ రబ్బాని, ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టించింది. అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. గ్రేటర్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగంలో పనిచేసిన పలువురు అధికారులు గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సారి ఇద్దరు ఒకేసారి పట్టుబడడంతో అవినీతి అధికారుల్లో వణుకుపుట్టింది.