హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాములోకి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 9 రోజులుగా నిర్వర్తిస్తున్న బ్రహ్మోత్సవాల ముగింపువేల కలుష ఉద్వాసనచేసి సీతారామచంద్రస్వామివార్లను ప్రత్యేక వేదిపై ప్రతిష్ఠించి యాగశాలలో విక్సక్సేన నవగ్రహ శ్రీసూక్తపురుషసూక్త జయాధి మహాసుదర్శన హోమం, పూర్ణాతి నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ప్రముఖ న్యాయవాది రవీందర్నాథ్- వసంత దంపతులు ఉభయదాలుగా రామునిపక్షాన ఒక దంపతులు సీతమ్మపక్షాన ఇంకో దంపతులు ఉభయులుగా వ్యవహరించి సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా గుదిమెళ్ల విజయకుమారాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణక్రతువు నిర్వహించారు.
కంకణధారణ యజ్ఞోపవిత్రధారణ, జిలకర బెల్లం, పాదప్రక్షాలన మహాసంకల్పయుక్తంగా, మంత్రోక్తంగా మాంగళ్యధారణ మాంగళ్యం తంతునేనంటు రామునికి సమర్పించి సీతమ్మ మెడలో మాంగళ్యధారణ గావించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 5 వేల మంది భక్తులకు వడపప్పు, బెల్లం పానకం మహాప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ భక్తులందరికీ చల్లని తాగునీరు అందించారు. వైదిక కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, పి.సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్‌కుమారాచార్యులు నిర్వర్తించారు. అనంతరం నాగవెళ్లి సదస్యం బ్రాహ్మణ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులి రజినీకాంత్, పల్లం రమేశ్, మాడిశెట్టి రాజు, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.