వెంకటాపూర్, జూలై 27 : రామప్ప ఆలయ నిర్మాణానికి వాడినవిగా భావిస్తున్న రాళ్లు పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి ప్రవాహంలో బయటపడుతున్నాయి. వరుసగా మూడేళ్లుగా సరస్సు మత్తడి పోస్తుండడంతో రాళ్లపైన మట్టి కొట్టుకుపోయి వెలుగుచూస్తున్నాయి. ఇంకా కొన్ని మట్టిలోనే కూరుకుపోయి కనిపిస్తున్నాయి. అక్కడక్కడా రాళ్లను కట్ చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఈ ప్రదేశంలోని రాళ్లనే చెక్కి ఆలయాల నిర్మాణంలో వాడి ఉంటారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రాళ్ల దగ్గరే మట్టికోట పక్కన ఓ ఆలయం ఉండడంతో రాళ్లు పడి ఉన్న ప్రదేశంలోనూ ఓ ఆలయం ఉండేదా? లేక రామప్ప గుడి కట్టేందుకు వాడిన రాళ్లలో ఇవి మిగిలినవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
రామప్ప చుట్టూ కిలోమీటర్ పరిధిలో కాకతీయుల నాటి ఆలయాలు ఇప్పటికీ 20 దాకా ఉన్నాయి. ఇంకా కనుమరుగైన ఆలయాలు ఎన్నో ఉండి ఉంటాయి. కాకతీయులతో పాటు వారి సామంతులు, సైన్యాధిపతులు, దండనాయకులు అనేక ఆలయాలను నిర్మించారు. వాటిలో ప్రస్తుతం ఎన్నో ఆలయాలు ఆదరణ లేక శిథిలావస్థకు చేరాయి. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా లభించడంతో కేంద్ర పురావస్తు శాఖ ఈ ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. కానీ చాలా ఆలయాలకు రక్షణ లేక నేటికీ దుండగుల చేతిలో ధ్వంసమవుతున్నాయి. వాటిని సంరక్షించి, భావి తరాలకు మన చరిత్రను, సంస్కృతిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఇలాంటి రాళ్లు ఉన్నచోట తవ్వకాలు చేపడితే మరిన్ని చారిత్రక నిర్మాణాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
రామప్ప సరస్సు మత్తడి ప్రవాహానికి బయటపడ్డ ఆలయానికి వాడిన రాళ్లు