గలగలా రామప్ప.. 365 రోజులూ జలకళ
గోదావరి జలాల తరలింపుతో రామప్ప సరస్సు ఏడాది పొడవునా నిండా నీటితో కళకళలాడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సరస్సు పూర్తిగా నిండి మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్నది.
- సాగు, తాగునీటి కేంద్రంగా జలాశయం
- నిండుకుండలా కనువిందు
- మూడు నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే సాగునీరు
- గోదావరి నుంచి 2,869 ఎంసీఎఫ్‌టీల నీటి పంపింగ్
- రోజుకు ఒక మోటర్ ద్వారా 50 ఎంసీఎఫ్‌టీల నీటి చేరిక
- నాలుగు ప్రాంతాలకు 60 ఎంసీఎఫ్‌టీల నీటి సరఫరా
- భీం ఘన్పూర్ నుంచి రామప్ప సరస్సుకు తరలుతున్న నీరు
గోదావరి జలాల తరలింపుతో రామప్ప సరస్సు ఏడాది పొడవునా నిండా నీటితో కళకళలాడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సరస్సు పూర్తిగా నిండి మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్నది. మూడు నియోజకవర్గాలకు సాగునీరందించడమే గాక వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానంతో తాగునీటి అవసరాలు తీరుస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది గోదావరి నుంచి 2,869 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీటిని పంప్ చేసేందుకు వారం క్రితం భీం గణపురం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించగా రోజూ ఒక మోటార్ ద్వారా 50 ఎంసీఎఫ్‌టీల నీరు రామప్పకు వచ్చి చేరుతున్నది. ఇలా వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చుతూ మూడు నియోజకవర్గాలోని పలు ప్రాంతాలకు వరప్రదాయినిగా మారింది.
– ములుగు, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులను తవ్వించి పటిష్టం చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ములుగు జిల్లాలోని కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు ఏడాది పొడవునా గలగలా పారుతూ జలకళతో ఉట్టిపడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి వర్షకాలంలో రామప్ప సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి దుంకుతూ పరవళ్లు తొక్కుతున్నది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప సరస్సును ఇంజినీరింగ్ శాఖ అధికారులు వాటర్‌గ్రిడ్‌కు అనుంధానం చేశారు. ఇందులో భాగంగా భీం ఘన్పూర్ చెరువు నుంచి నాలుగు మోటార్ల ద్వారా రామప్ప సరస్సులోకి నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి ప్రతి ఎండాకాలంలో రామప్ప సరస్సులోకి గోదావరి నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తూ రామప్ప సరస్సును నింపుతున్నారు. ఇందులో భాగంగా ఈ సీజన్లో 2,869 మిలియన్ క్యూబిక్ ఫీట్ల(ఎంసీఎఫ్‌టీ) నీటిని పంపింగ్ చేసేందుకు వారం క్రితం మోటార్ల ద్వారా ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి రోజూ ఒక మోటార్ ద్వారా 50 ఎంసీఎఫ్‌టీల నీటిని పంపింగ్ చేస్తున్నారు.

గోదావరి నుంచి పంపింగ్
రామప్ప సరస్సులోకి ఈ సీజన్లో 2869 ఎంసీఎఫ్‌టీల నీటిని భీం గణపురం చెరువు నుంచి రోజుకు 50 ఎంసీఎఫ్‌టీల నీటి చొప్పున తరలించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 13న రామప్ప సరస్సు నీటిమట్టం 28 ఫీట్లు కాగా ప్రతి రోజూ పంపింగ్ ద్వారా గోదావరి నీళ్లు రామప్ప సరస్సులోకి వచ్చి చేరుతుండడంతో 24వ తేదీ వరకు 29 ఫీట్ల నీటిమట్టానికి చేరింది. ఓవైపు సరస్సులోకి నీరు వస్తుండగా మరోవైపు వెంటనే ములుగు శివారు రంగారావుపల్లిలో నిర్మించిన పంపుహౌస్ ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల, రంగాయ చెరువులకు నీటిని తరలిస్తున్నారు. రామప్ప సరస్సు నుంచి ఈ వేసవిలో నాలుగు ప్రాంతాలకు 60 ఎంసీఎఫ్‌టీల నీటిని రోజూ నాలుగు ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకేంద్రంలోని రంగరావుపల్లి వద్ద నిర్మించిన పంప్‌హౌస్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం పాకాల చెరువుకు 1,050 ఎంసీఎఫ్‌టీల నీటిని ఈ వేసవిలో పంపించేందుకు రోజూ 25 ఎంసీఎఫ్‌టీల నీటిని తరలిస్తున్నారు. ఇదే పంప్‌హౌస్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువుకు 200 ఎంసీఎఫ్‌టీ నీటిని పంపించాల్సి ఉండగా ప్రస్తుతం రోజూ 15 ఎంసీఎఫ్‌టీల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ నీటితో పాటు వెంకటాపూర్ మండలం నర్సాపూర్ శివారు నుంచి చాతరాజుపల్లి మీదుగా గ్రావిటీ కెనాల్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపురం, వంగపల్లి చెరువులకు 100 ఎంసీఎఫ్‌టీల నీటిని పంపించాల్సి ఉండగా ప్రస్తుతం రోజూ 8 ఎంసీఎఫ్‌టీల నీటిని గణపురం చెరువుకు, 12 ఎంసీఎఫ్‌టీల నీటిని వంగపల్లి చెరువుకు చేరవేస్తున్నారు. మరో 1,280 ఎంసీఎఫ్‌టీల నీటిని రామప్ప సరస్సులో నిలువ చేయనున్నారు. అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం 239 ఎంసీఎఫ్‌టీల నీటిని వినియోగించనున్నారు.
365 రోజులు జలకళతో కనువిందు
రామప్ప సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 35 ఫీట్లు కాగా గత వర్షకాలంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నెల రోజుల పాటు మత్తడి పడింది. ప్రస్తుతం గోదావరి జలాలను రామప్ప సరస్సులోకి తరలిస్తుండడంతో సంవత్సరంలోని 365 రోజులు నిండుకుండను తలపిస్తూ రామప్ప సరస్సు జలకళతో కనువిందు చేస్తున్నది. సాగునీటి అవసరాలకు వినియోగించే నీళ్లతో పాటు తాగునీటి అవసరాలకు సైతం రామప్ప సరస్సులోని నీటిని వినియోగిస్తున్నారు. రామప్ప జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం ఫిల్టర్‌బెడ్‌ను ఏర్పాటు చేయగా మిషన్ భగీరథ పథకం కింద 239 ఎంసీఎఫ్‌టీల నీటిని వినియోగించనున్నారు. రామప్ప ఆయకట్టులో వెంకటాపూర్, ములుగు, గణపురం మండలాల్లోని పలు గ్రామాల్లో అధికారికంగా 5,150 ఎకరాలకు నీరందుతుండగా అనధికారంగా మరో 5వేల ఎకరాల వరకు రామప్ప సరస్సులోని కాల్వల ద్వారా వెళ్లే నీళ్లతో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రామప్ప సరస్సుకు ప్రస్తుతం రోజూ గోదావరి నుంచి 50 ఎంసీఎఫ్‌టీల నీరు వచ్చి చేరుతుండగా 60 ఎస్సీఎఫ్టీల నీరు నాలుగు ప్రాంతాలకు తరలిస్తున్నారు. రామప్పలో మిషన్ భగీరథ పథకం కింద ఏర్పాటుచేసిన పంప్‌హౌస్ నుంచి ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాలతో పాటు గణపురం మండలంలోని కొన్ని గ్రామాలకు ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

