బచ్చన్నపేట ఏప్రిల్ 21 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే తమ లక్ష్యమని ఐసిడిఎస్ సిడిపిఓ రమాదేవి అన్నారు. సోమవారం మండలంలోని గోపాల్ నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా అవగాహన పెంచాలన్నారు. కేంద్రాల్లోకి వచ్చే పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు లేకపోతే వెంటనే వారిని గుర్తించి, సరైన పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్నారుల ఆరోగ్యం పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత ఉందన్నారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి, మండలంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం మరింత పెంచాలన్నారు. అంతేకాకుండా కేంద్రాల లోపల, బయట పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలన్నారు. కూరగాయల తోటలు పెంచేందుకు ఆసక్తి చూపాలన్నారు. వాటితో కేంద్రాలకు వచ్చే వారికి ఎంతో తోడ్పాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ మనోహర, జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్ సృజన, అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం లక్ష్మి, పర్వతం భాగ్యలక్ష్మి, కవిత,శిరీష, పాల్గొన్నారు.