బచ్చన్నపేట. ఫిబ్రవరి 28 : విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికరమైన ఆహారం అందించాలని జనగామ జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ను ఆయన సందర్శించారు. అనంతరం రికార్డులు, వంటగదిని పరిశీలించారు. కూరగాయలు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో బాలికల తల్లిదండ్రులు తమ పాఠశాలలో పిల్లలను చేర్చిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్య అందించాలన్నారు.
క్రమశిక్షణతో పాటు చదువుల్లో రాణించేలా వారిని తీర్చిదిద్దాలన్నారు. అదేవిధంగా బాలికలకు వారి ఆత్మ రక్షణ కోసం కరాటే, కత్తి సాము వంటి శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున విద్యార్థులు లేపి యోగా ధ్యానం పై అవగాహన పెంచాలన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయమ్ లో చదువుతున్న బాలికలు అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి గీత, పంచాయతీ కార్యదర్శి నరసింహ చారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.