బచ్చన్నపేట మే 9 : మండలంలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జనగామ జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కొడవటూరు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అన్ని విధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. వీధుల్లో ఉన్న డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
నర్సరీలో మొక్క ఎండిపోకుండా ప్రతిరోజు వాటరింగ్ చేయాలన్నారు. గ్రామాల్లో నాటిన మొక్కలకు, అదేవిధంగా ఊరు బయట నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పట్టించాలన్నారు. ముఖ్యంగా ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి, పంచాయతీ ట్రాక్టర్కు అందించాలన్నారు. గ్రామంలో మురికి కాలువలో, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపా చైతన్య, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.