నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 12 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్టీయూ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఏఐఎఫ్టీయూ తదితర సం ఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో హోరెత్తించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బీజేపీ సర్కారు తీరుపై మండిపడ్డారు.
భూపాలపల్లి ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్, వర్షాప్, ఏరియా హాస్పిటల్ అన్ని విభాగాల్లో కార్మికులు విధులకు హాజరు కాకుండా సమ్మె నిర్వహించారు. దీంతో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు మధ్యాహ్నం ప్లాంట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. హనుమకొండలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలతో కలిసి హనుమకొండలో బైక్, ఆటో ర్యాలీ తీశారు. జనగామ రైల్వే స్టేషన్ నుంచి ప్రెస్టన్ స్కూల్ వరకు ప్రదర్శనగా వచ్చారు. ములుగులో సీపీఐఎంఎల్, సీపీఐ, ఎంసీపీఐ, న్యూడెమోక్రసీ అనుబంధ రైతు సంఘాల నాయకులు, కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆందోళనల్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయ తీ, మున్సిపల్, మధ్యాహ్న భోజన తదితర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్లను తెచ్చి కార్మిక హకులను కాలరాస్తుందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం కోసమే వీటిని తెస్తుందని, లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీ, రైల్వే, పోస్టల్, సింగరేణి లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు కట్టబెడుతుందని మండిపడ్డారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Warangal