నయీంనగర్, మే 20 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంస్కారవంతుడు, సమాజ సేవకుడు, బిట్స్ పిలానీ గోల్డ్ మెడలిస్ట్ రాకేశ్‌రెడ్డికి, నయవంచకుడు, పూటకో పార్టీ మార్చి ఓ యూట్యూబ్ చానల్ ద్వారా పీడిత ప్రజల రక్తం తాగే చింతపండు నవీన్‌కు పోటీ జరుగుతున్నదని మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. కేయూ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు, పరిశోధక విద్యార్థులతో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరు లతో మాట్లాడారు. సంసారహీనుడు చట్టసభల్లోకి వెళ్తే ప్రమాదకరమని, విషయ పరిజ్ఞానం కలిగిన సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తాడని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొట్లాడే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు
. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేయూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని కోరారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మంలోని 34 నియోజకవర్గాల్లోని విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి ప్రభాకర్, పాలమాకుల కొమురయ్య, దామోదర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర, కార్యదర్శి సూర్యకిరణ్, రాజేశ్‌నాయక్, జిల్లా కోఆర్డినేటర్ అరూరి రంజిత్, బైరపాక ప్రశాంత్, కేయూ బీఆర్ఎస్వీ ఇన్చార్జి జెట్టి రాజేందర్, యూనివర్సిటీ నాయకులు గొల్లపల్లి వీరు, కొనుకటి ప్రశాంత్, పిన్నింటి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.