నల్లబెల్లి : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు(Pending bills) త్వరితగతిన విడుదల చేయాలని మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నానబోయిన రాజారాం డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ సత్య శారదకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము సర్పంచులుగా ఉన్న పదవీకాలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రధానంగా గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, గ్రామాల సుందరీకరణ పనులు, డ్రైనేజీల నిర్మాణాలు, అంతర్గత రోడ్ల అభివృద్ధితో పాటు అనేక రకాల అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టామన్నారు.
అయితే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడంలో తాత్సారం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ మంత్రులకు మొర పెట్టుకున్నప్పటికీ తమకు బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. అయితే అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, నేడు తెచ్చిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోవడంతో ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 63 మంది మాజీ సర్పంచులు అప్పులు కట్టలేక జీవితంపై విరక్తి చెంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించాలని లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ సర్పంచులు లావుడియా తిరుపతి నాయక్, తంగెళ్ల నిర్మల, గూబ తిరుపతమ్మ, తదితరులు ఉన్నారు.