ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సాగు రైతన్నకు పెను భారమైంది. అటు కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇవ్వకపోవడం, దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూ లించకపోవడంతో అన్నదాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏటా జూన్‌లో ఠంచన్‌గా పెట్టుబడి సాయం రావడంతో రంది లేకుండా ఎవుసం సాగగా, ఈసారి మాత్రం ములుగు జిల్లాలో సుమారు రూ.80కోట్ల దాకా రైతులపై ఆర్థిక భారం పడింది. అంతేగాక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దొరకక బయట మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వచ్చింది.
– ములుగు, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)
ములుగు జిల్లాలో ఖరీఫ్ సాగుకు భరోసా లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా రైతుభరోసా ఇస్తామని ప్రకటించినప్పటికీ అందించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు తెచ్చి సాగు చేయాల్సి వచ్చింది. గత బీఆర్ఎస్ సర్కారు హయంలో జూన్ నెలలో పెట్టుబడి సహాయం అందేది. జిల్లాలో 76వేల నుంచి 80వేల మంది రైతులకు సుమారు రూ.80కోట్ల పెట్టుబడి సాయం అందేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి సాయం మాత్రం అందలేదు.
జిల్లాలో వరి, మిర్చి, పత్తి అధికంగా సాగు అవుతుండగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కూడా లభించకపోవడంతో పాటు అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేసి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. అంతేగాక రైతు రుణమాఫీదీ అదే పరిస్థితి. అర్హులైన రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం జిల్లాలో రెండు విడుతల్లో కేవలం 23,857మందికి రూ.194కోట్ల 57వేలను మాత్రమే మాఫీ చేయగా ఇంకా వేలాది మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. అటు రైతుభరోసా రాక.. రుణమాఫీ వర్తించక దరఖాస్తులు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారుతున్నారు.