వర్ధన్నపేట, జూలై 12: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తేనే భావితరాలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఎంసీ వార్తింగ్ అన్నారు. మండలంలోని కొత్తపల్లి ఆకేరువాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం, వర్ధన్నపేట మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇంకుడు గుంతలు, మియావాకీ, పట్టణ ప్రకృతి వనాలను కేంద్ర అధికారి రాజేశ్‌కుమార్ నీమా, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్‌తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంసీ వార్తింగ్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాగుల్లో ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి ఆపకపోతే సముద్రంలో కలిసిపోయి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.
ఈ మేరకు వాగుల్లో చెక్‌డ్యాంలు నిర్మించి ఏడాదంతా నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరుగడంతోపాటు వాతావరణంలో మంచి మార్పులు వచ్చి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇండ్లలో వాడుకునే నీటిని కూడా వీధుల్లోకి వెళ్లకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటూ భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాని కోరారు. అనంతరం వర్ధన్నపేట మియావాకీలో మొక్కలను ఎంతో జాగ్రత్తగా పెంచిన వాచర్లు, అధికారులను కేంద్ర అధికారులు అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎం సంపత్‌రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ జీ రవీందర్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీవో నాగేశ్వర్ పాల్గొన్నారు.
పల్లెప్రకృతి వనం అద్భుతం
రాయపర్తి: మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం అద్భుతంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని జలశక్తి అభియాన్ విభాగం ప్రత్యేక అధికారుల బృందం ప్రశంసించింది. మంగళవారం రాయపర్తి, కొండూరు, జయరాంతండ(కే) లో బృందం సభ్యులు పర్యటించారు. తొలుత మండలకేంద్రానికి చేరుకున్న జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఎంసీ వర్తింగ్, హైడ్రాలజీ శాస్త్రవేత్త ఆర్కే నీమాతో కూడిన ద్విసభ్య అధికారుల బృందం పెర్కవేడు రహదారిలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. విలేజ్ పార్కు నిర్మాణ శైలి, మొక్కల పెంపకాన్ని చూసి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని వారు అభినందించారు. అనంతరం పాలకుర్తి-రాయపర్తి-అన్నారం షరీఫ్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిస్తున్న మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పనులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న రెయిన్ ప్రూఫ్ హార్వేస్టింగ్ స్టక్చర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు జీపీ పాలకవర్గాలు శ్రమిస్తున్న తీరు తమను ఎంతగానో ఆకట్టుకున్నదని తెలిపారు. తర్వాత కొండూరుకు చేరుకున్న వారు సర్పంచ్ కర్ర సరితా రవీందర్‌రెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌తో కలిసి సున్నంకుంటను క్షేత్రస్థాయిలో సందర్శించిన అధికారుల బృందం సభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జయరాంతండాకు చేరుకుని తండావాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో వసుమతి, ఏపీడీ సాయిచరణ్, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఈసీ ప్రవీణ్‌కుమార్, టీఏలు వెంకట్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సరోజన, కార్యదర్శులు రాజ్‌కుమార్, భరత్, సర్పంచ్‌లు చిరంజీవి, ఉపేందర్, రాజు, కిశోర్‌కుమార్, రాములు, మహేశ్, వెంకన్న పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని రావూర్, మంగ్త్యాతండాలో జలశక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటించింది. రావూర్లో చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. సభ్యుల వెంట ఏపీడీ సాయిచరణ్, ఎంపీపీ కమల, సర్పంచ్‌లు బండి సంతోష్, ఈర్యానాయక్, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ ఉన్నారు.