నమస్తే నెట్వర్క్, ఆగస్టు 7: రోజంతా వాన కురిసింది. మహబూబాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడగా, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముసురేసింది. ములుగులో అక్కడక్కడా మోస్తరు వాన పడింది. జిల్లావ్యాప్తంగా జలాశయాలన్నీ నిండకుండలా మారాయి. మహబూబాబాద్ మండల పరిధిలోని ఉత్తరతండా గ్రామ పంచాయతీ నేతాజీ తండా ప్రాథమిక పాఠశాల తరగతి గదుల్లోకి వరద నీరు చేరింది.
మధ్యాహ్న భోజన బియ్యం, సరుకులు తడిసి ముద్దయ్యాయి. డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. బయ్యారం మండలం మెట్లతిమ్మాపురం శివారులోని వట్టెవాగు ఉధృతితో గ్రామానికి రాకపోకలు బందయ్యాయి. గార్ల మండలంలో పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మద్దివంచ-రాంపురం మధ్య రాకపోకలు నిలిచిపోయా యి.
నెల్లికుదురు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వావిలాల వద్ద కాజ్వే పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నర్సింహులపేటలోని ఉన్నత పాఠశాలలో చెట్టు కూలిపోయింది. చిన్నగూడూరు నుంచి పగిడిపల్లికి వెళ్లే రహదారిపై జిన్నలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగపేట మండలంలోని మల్లూరు వాగు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటిమట్టం చేరడంతో మత్తడి పడు తోంది.
Warangal1
లక్నవరం సరస్సు నీటి సామర్థ్యం 33.5 అడుగులు కాగా, దానిని మించి నీరు చేరడంతో మత్తడి పోస్తోంది. వేలాడే వంతెనలు నీటిపై తేలియాడుతున్నట్లుగా పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వాజేడు-వెంకటాపురం మండలాలకు వెళ్లే రాష్ట్ర రహదారిపైకి వరదనీరు చేరి వాగును తలపిస్తోంది. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. వెంకటాపురం (నూగూరు) మండలంలోని కలిపాక, ముత్తారం, పెంకవాగు, కర్రవానిగుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్, హనుమకొండలో ముసురు కమ్మేసింది. రోజంతా చిరుజల్లులతో వర్షం కురిసింది. వరంగల్ జిల్లా ఖానారం మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం 29.9 అడుగులకు చేరుకుంది. మరో అర ఫీటు నీరు చేరితే మత్తడి దుంకనుంది.