న్యూశాయంపేట, సెప్టెంబర్ 23 : వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కాలనీలన్నీ అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలాన్నీ నీట మునిగి ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రంతా కురిసిన వర్షంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. వర్షం నీటిని బయటికి పంపించేందుకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. ఈ పరిస్థితి ఏకంగా నగరం నడిబొడ్డున ఉన్న 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ జరిగింది.
ఈ కాలనీలో దాదాపుగా 300కు పైగా ఇండ్లు నిర్మించుకొని, వందల మంది జనాభా జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే రాత్రి కురిసిన వర్షం వల్ల భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి.
నిత్యం కాలనీ నుండి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలీలు, తదితరులు పనుల నిమిత్తం నిత్యం వెళుతుంటాడు.
కాలనీలో భారీగా నీరు చేరడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లలేని దుస్థితి నెలకొంది .వర్షాల కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో అంతర్గత రోడ్లు వేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.