కేసముద్రం, సెప్టెంబర్ 5 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ఎట్టకేలకు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలకు 418 కిలోమీటర్ రాయి వద్ద ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నెల 1న సాయంత్రం నుంచి రైల్వే అధికారులు వందల మంది కూలీలు, భారీ యంత్రాల సాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
కాగా, బుధవారం అప్ లైన్ ట్రాక్ పనులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలు ప్రారంభించారు. కాగా, గురువారం ఉదయం డౌన్ లైన్ ట్రాక్ పనులను సైతం పూర్తి చేసి మొదట గూడ్స్ రైలు ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం గోల్కొండ, కృష్ణ, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పంపించారు. దీంతో రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని తగ్గించి నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఖిలావరంగల్ : భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ -విశాఖపట్టణం వందే భారత్, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు వెళ్లే రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పునరుద్ధరించినట్లు తెలిపారు.