కాజీపేట, మే 6: దేశంలో ఇటీవల కాలంలో వరస రైల్వే ప్రమాదాలు సంభవిస్తున్నాయని, రైల్వే సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అన్నారు. సిఐటియు హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రావుల రమేష్ మాట్లాడుతూ లోకో పైలట్లు, రైల్వే మేనేజర్లు, ట్రాక్ మెయిన్టనర్లు, రైల్వే ఉద్యోగుల్లో నియమించ బడిన వివిధ విభాగాల కాంట్రాక్టు కార్మికులు, వందలాది ప్రయాణికులు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే ప్రమాదాలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది పేద కార్మికులు, జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులేనని వరుస ప్రమాదాలతో భారీ ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ కీలకమైన రైల్వే రంగంలో రైలు ప్రమాదాల నివారణకు సమర్థ వంతమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.
రైల్వే ప్రయాణికుల భద్రతను పటిష్ట పరచాలని, రైల్వే ఉద్యోగులకు సురక్షితమైన పని పరిస్థితులు కల్పించాలన్నారు. భారతీయ రైల్వేల ప్రవేటికరణను నిలిపి వేయాలన్నారు. ఎక్స్ప్రెస్ రైలులో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బోట్ల చక్రపాణి, జిల్లా నాయకులు కారు ఉపేందర్, ఓరుగంటి సాంబయ్య, జంపాల రమేష్, కోటి తదితరులతో పాటుగా కార్మికులు పాల్గొన్నారు.