కాజీపేట, జూన్ 17 : రైలు ప్రయాణికులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తులపై రైల్వే పోలీస్ నిఘా పెట్టింది. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మూడేళ్లల్లో జరిగిన చైన్‌స్నాచర్లు, దొంగతనం, దోపిడీ కేసుల్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు జైళ్లలోనే ఉండగా, మరికొందరు బెయిల్‌పై బయటకొచ్చారు. వారు ఏం చేస్తున్నారనేది పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పాటుగా ఇటీవల కాజీపేట-పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై రాళ్లు పెట్టడంతో వందేభారత్, గరీభ్థ్ రైళ్లు నిలిచిపోయాయి. గతంలో కాజీపేట రైల్వే జంక్షన్-జనగామ రైల్వే స్టేషన్ల మధ్య కొందరు రైలు దోపిడీకి పాల్పడ్డారు. ఇలాంటి వారిపై జీఆర్పీ సిబ్బంది వేట మొదలు పెట్టారు.
పోలీసుల అప్రమత్తం..
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో రెండు సర్కిల్, మూడు జీఆర్పీ స్టేషన్లు, 11 అవుట్ పో స్టులు ఉన్నాయి. రైల్వే డీఎస్పీ కృపాకర్ ఆదేశానుసారం ఇద్దరు జీఆర్పీ సీఐలు పర్యవేక్షిస్తుంటారు. సెక్షన్లో తిరిగే రైళ్లలో ప్రయాణికుల సెల్‌ఫోన్, బ్యాగులు, మెడలోని బంగారం చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. బోగీల్లో చేరి అదను చూసి ప్రయాణికుల సొమ్మంతా కొట్టేస్తున్న ఘటనలు పెరిగాయి. రైల్వే పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయిలో జీఆర్పీ పోలీసుల పని తీరు, కేసుల దర్యాప్తు, పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు.
జైలు కెళ్లిన నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని, బయటకు వచ్చాక చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలని ఆదేశించినట్లు సమాచారం. ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో రైల్వే డీఎస్పీ కృపాకర్ నేతృత్వంలో సిబ్బంది జైలులో రిమాండ్ ఖైదీలు, బెయిల్‌పై బయటికొచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. జనగామ, కాజీపేట, వరంగల్, డోర్నకల్, ఖమ్మం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, పెద్దపల్లి, కరీంనగ ర్ రైల్వే స్టేషన్లలో అధిక శాతం చోరీ కేసులు నమోదవుతున్నాయి. బంగారం, నగదు, బ్యాగులు, సెల్ఫోన్లు దొంగలు అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు. సిబ్బంది కొరతతో నిందితులను గుర్తించడం, అరెస్ట్ చేయడం పోలీస్‌లకు సవాల్‌గా మారుతున్నది.
నేరస్తులపై నిరంతర నిఘా..
నేరస్తులపై జీఆర్పీ నిరంతర నిఘా ఉంటుంది. రైళ్లు, ప్లాట్‌ఫాంలపై దొంగతనం జరిగిందని ఫిర్యాదు రాగానే పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తాం. దీంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకుంటాం. రైళ్లల్లో తిరిగే వారిని ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే అదుపులోకి తీసుకుంటాం.
– జీఆర్పీ సీఐ నరేశ్‌కుమార్