కాజీపేట, జూలై 8 : రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనుల కోసం నిర్దేశించిన స్థలంలో దాదాపు వారం నుంచీ బీజేపీ రాష్ట్ర నాయకులు, రైల్వే అధికారులు హడావుడి చేశారు. ప్రధాని మోదీ ఇక్కడికే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తారేమో అన్నంతగా హంగామా చేశారు. తీరా చూస్తే ఎక్కడైతే రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ పెడుతున్నారో ఆ స్థలాన్ని.. శంకుస్థాపన రోజే ఎవరూ కన్నెత్తి చూడలేదు. కాజీపేట రైల్వే జంక్షన్ శివారు అయోధ్యపురం సమీపంలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్, రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు స్థలం దాదాపు వారం, పది రోజులుగా రైల్వే అధికారులు, బీజేపీ నాయకుల హంగామా, ఆర్భాటాలతో హడావుడిగా కనిపించింది. కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్, రైల్వే వ్యాగన్ పీవోహెచ్‌కు ప్రధాని మోదీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం నుంచే శనివారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కానీ ఆ రోజునే రైల్వే అధికారులు గాని, బీజేపీ ప్రజాప్రతినిధులు గాని ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడంతో వెలవెలబోయి కనిపించింది. ప్రధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని నేరుగా చూడలేకున్నా ఈ స్థలంలో ఏదైనా కార్యక్రమం పెడుతారేమోనని అయోధ్యపురం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో పెదవివిరుస్తూ వెనుదిరిగారు. దక్షిణ మధ్య రైల్వే(జోన్) జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా తదితర రైల్వే ఉన్నతాధికారులతో కలిసి సికింద్రాబాద్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్‌కు ప్రత్యేక రైలులో వచ్చారు. నేరుగా రోడ్డు మార్గంలో నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రధాని కార్యక్రమానికి హాజరై అనంతరం తిరిగి రైలులో సికింద్రాబాద్ వెళ్లిపోయారు. ఇటీవల రైల్వే జీఎం ఏకే జైన్, సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా ముఖ్య రైల్వే ఉన్నతాధికారులు వేర్వేరుగా వ్యాగన్ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని సందర్శించినప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ అంటూ పలుమార్లు చెప్పారని, అలాంటి భారీ రైల్వే పరిశ్రమ శంకుస్థాపన రోజున రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ఇక్కడికి రాకపోవడంలో ఆంతర్యమేమిటని స్థానికులు చర్చించుకున్నారు. ఏ ప్రాంతంలోనైనా వర్చువల్‌గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే స్థానిక అధికారులు అక్కడ శిలాఫలకం, టీవీ స్క్రీన్, తదితర ఏర్పాట్లు చేస్తారని, ఈ ప్రాంత రైల్వే అధికారులు అలాంటి ఏర్పాట్లేవీ చేయలేదని పెదవి విరిచారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా వ్యాగన్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడం, ఈ స్థలంతో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం చూస్తుంటే అసలు ఇక్కడ పనులు జరుగుతాయా? లేక ఈ ప్రాంతవాసులను మభ్యపెట్టేందుకు హడావుడి చేస్తున్నారా? అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.