కాజీపేట, ఏప్రిల్ 23: కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని కోరుతూ తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ధర్మపోరాట దీక్ష రసాభాసగా మారింది. దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇచ్చిందని, మిగిలిన పదెకరాల భూమిని స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఇవ్వడంలేదని ఆరోపించారు. దీంతో శంకుస్థాపనలో జాప్యం జరుగుతున్నదని రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో స్థానికులు, రైల్వే కార్మికుల కుటుంబాలు నిలదీశారు. 150 ఎకరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 ఎకరాల భూమిని ఇవ్వదా అని రాకేశ్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 ఎకరాలను రైల్వేకు అప్పగించడంతోపాటు రైతులకు పరిహారం చెల్లించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కావాలని శంకుస్థాపన జరుగకుండా జాప్యం చేస్తున్నదన్నారు. కాజీపేట రైల్వే వ్యాగెన్ పీవోహెచ్ షెడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించి రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీంతో బీజేపీ నాయకులు, స్థానికులు, రైల్వే కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకోవడంతో నిర్వాహకులు ఇరువర్గాలకు నచ్చజెప్పి తిరిగి దీక్షను ప్రారంభించారు.
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నిరసన
కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కావాలనే రైల్వే వ్యాగెన్ పీవోహెచ్ షెడ్‌కు శంకుస్థాపన చేయకుండా అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి విమర్శించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరినొకరు తోపులాడుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను దీక్ష శిబిరం నుంచి పక్కకు తప్పించారు. దీంతో నిర్వాహకులు దీక్షను విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో పోలీసులు దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్, చైర్మన్ దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ రైల్వే వ్యాగెన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. స్థానికులకు దామాషా ప్రకారం 52 శాతం, భూ నిర్వాసితులకు 16 శాతం ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ రైల్వే జేఏసీ ధర్మపోరాట దీక్షను చేపట్టిందన్నారు. కొన్ని పార్టీలు తమ స్వలాభం కోసం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ దీక్ష జరుగనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. త్వరలో రైల్వే జేఏ సీ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలను కలుపుకుని ఇం టింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాడుతామన్నారు.