కాజీపేట, ఏప్రిల్ 28: ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పైకి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాజీపేట రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్లో కేసులు నమోదైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ఆర్పీఎఫ్ సిఐ సి.చటర్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ జరిగిందన్నారు. కాగా, కాజీపేట రైల్వే జంక్షన్ – బలార్ష – కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని సెక్షన్లో రైళ్ల రాకపోకల రద్దీ విపరీతంగా ఉంటుందన్నారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా తరలి వచ్చిన కార్యకర్తలు రైల్వే గేటు మూసివేయడంతో తమ వాహనాలు దిగి రైల్వే గేట్ సమీపంలోని రైలు పట్టాల పైకి వచ్చారన్నారు.
దీంతో న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళుతున్న నవ జీవన్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ రైలు పట్టాలపై భారీగా జనం ఉండటంతో రైలును పదినిమిషాల పాటు గేట్ సమీపంలో నిలిపి వేశారని చెప్పారు. ఆ తర్వాత స్థానిక అధికారుల సూచనతో రైలు ముందు కదిలిందన్నారు. నవ జీవన్ ఎక్స్ప్రెస్10 నిమిషాల పాటు డిటెన్ కావడంతో రైలు లోకో పైలట్ సమాచారం మేరకు రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉప్పల్ రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై వచ్చిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.