హనుమకొండ, మే 11: మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలనే జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో కే.శాంత అధ్యక్షతన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాగుల రమేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలకు పైగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకి భోజనం వండి పెడుతున్న కార్మికులను కాదని జిల్లాలో అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని నిర్ణయించడం కార్మికులను రోడ్డుమీద పడేయడమే అని అన్నారు.
ఏండ్ల తరబడి బిల్లులు, వేతనాలు వచ్చినా రాకపోయినా వంట చేస్తున్న కార్మికుల పట్ల అధికారుల నిర్ణయం సరైంది కాదని తక్షణమే ఆ ఆలోచనను విరవించుకొని మధ్యాహ్న భోజన కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని రాగుల రమేష్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులను కలుస్తామని, మే14వ తేదీన హనుమకొండ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఒక పక్క కనీస వేతనాలు ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని ఆందోళన పోరాటాలు చేస్తుంటే అధికారులు కార్మికుల పొట్ట కొట్టే నిర్ణయాలు చేయడం సరికాదన్నారు.
పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని వేడివేడిగా వండి పెడుతున్న కార్మికుల పట్ల అధికారుల నిర్ణయం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత, యూనియన్ నాయకులు సక్కుబాయి, కే.కవిత, స్వప్న, రాణి, విజయ, శారద, వసుంధర, తస్లీమ్, సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు.