CMD of TGNPDCL | హనుమకొండ, జూన్ 28: భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్లో శనివారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎండీ డైరెక్టర్లు, ఉద్యోగులతో కలిసి పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట, దేశ పురోగభివృద్ధికి ఆయన అందించిన సేవలు ప్రతీ ఒక్కరూ ఆచరించాలని కోరారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఫలితంగా దేశంలో అందరికి అవకాశాలు పెరిగాయన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ అపరచాణక్యుడుగా పేరు గడించిన పీవీ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు.
రాష్ర్ట, కేంద్ర మంత్రి పదవులతో పాటుగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సాహిత్య కృషికి ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారన్నారు. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనదని సీఎండి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వీ మోహన్ రావు, టీ మధుసూధన్, సీ ప్రభాకర్, సీఈలు టీ సదర్ లాల్, బీ అశోక్ కుమార్, కే తిరుమల్ రావు, రాజు హన్, రవీంద్రనాధ్, అశోక్, వెంకట రమణ, ఆర్ చరణ్ దాస్, మాధవ్ రావు, జాయింట్ సెక్రటరి కే రమేష్, ఇంజనీర్స్, అకౌంట్స్, పీ అండ్ జీ ఆర్టిజన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.