బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి.. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి నేడు. మౌనమునిగా పేరుగాంచిన పీవీ మన దేశానికి ఎనలేని సేవలు చేసినా కాంగ్రెస్ పాలకులు ఆయనను విస్మరించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చింది. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర కాగా, ఆయన తన అమ్మమ్మగారి ఊరైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921, జూన్ 28న జన్మించారు. పీవీ తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలు పెట్టిన ఆయన, హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. కళాశాల చదువుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతోపాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది.
నిజాం ఏలుబడిలోని ఏ ప్రాంతంలోనూ చదివేందుకు వీలు లేదని అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొంతకాలం అజ్ఙాతవాసం ఉండి చాందా క్యాంపులో క్రియాశీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు.
కాకతీయ పత్రిక
పీవీ తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్ జిల్లాలో స్థాపించారు. 1946-1955 వరకు వారపత్రికను కొనసాగించారు. ఇందులో గొల్లరామవ్వకథ, నీలిరంగు పట్టుచీర, మంగయ్యజీవితం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దంపట్టాయి. పీవీ రచించిన ఆర్తగీతికలు కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. పీవీ రాసిన తన ఆత్మకథ ‘లోపలిమనిషి’లో భారతదేశ చరిత్ర, హైదరాబాద్ సంస్థానంలోని విశిష్టమైన అంశాలు, జరిగిన పరిణామాల గురించి వివరించారు.
సాహితీసంపన్నుడు
పీవీకి 17భాషల్లో ప్రావీణ్యం ఉంది. మరాఠీ నవలలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను హిందీలోకి అనువాదం చేశారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. హరినారాయణ్ ఆప్టే మరాఠీ ప్రసిద్ధ నవల ‘పాన్లక్షత్ కోన్ఘెటా’ను పీవీ ‘అబలజీవితం’ పేరుతో తెలుగులో అనువదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1972 ఆగస్టు 15న శాసనసభలో ‘ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కొంచినాడు’అని తన సందేశాన్ని కవితాగానం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్య్ర రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్ధరాత్రి జరిగిన శాసనసభలో పీవీ ఉద్వేగభరితంగా గీతాన్ని ఆలపించారు.‘ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుం జముగ వెలుగుటే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఙ..!’ అనడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల చప్పట్లతో సభ మార్మోగింది.
క్లిష్టసమయాల్లో బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముల్కీ నిబంధనలు చట్టవిరుద్ధమని చెప్పిన సుప్రీం కోర్టు తీర్పును బహిరంగంగా స్వాగతించినందుకు అప్పటి సీమాంధ్రనేతలు ఆయనపై కక్షగట్టారు. భూసంస్కరణల చట్టం అమలుకు ఏకంగా ఆర్డినెన్స్ తేవడం తెలంగాణ-ఆంధ్రానేతలకు కంఠగింపుగా మారింది. ఫలితంగా పీవీ ముఖ్యమంత్రి పదవీచ్యుతుడయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని భారత ప్రధానిగా తన శక్తియుక్తులతో గట్టెక్కించారు. మెజారిటీ లేని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. 1996లో ప్రధానమంత్రి పదవీకాలం ముగిశాక పీవీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చివరకు పీవీ 2004లో పరమపదించారు.
అపరచాణక్యుడు
రాజకీయాల్లో పీవీకి అపరచాణక్యుడిగా పేరుంది. ఆయన ఏ పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిచింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా మొదలు.. దేశ ప్రధాని వరకు ఆయన ప్రజల మనిషిగానే పనిచేశారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కవి, రచయిత, అనువాదకుడు, కథకుడు, పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ.
నేడు జయంతి వేడుకలు
వంగర, లక్నేపల్లి గ్రామాల్లో పీవీ జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. లక్నేపల్లిలో ఎమ్మెల్యే పెద్ది, వంగరలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, జడ్పీ అధ్యక్షుడు మారపల్లి సుధీర్‌కుమార్ పాల్గొననునారు. పీవీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన సోదరుని కుమారుడు మదన్మోహన్రావు కోరారు.