మహదేవ్పూర్ (కాళేశ్వరం) జూలై 7 : వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటర్ల ద్వారా ఎత్తిపోసే అవకాశమున్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపుహౌజ్ ను ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
మేడిగడ్డ బరాజ్ గేట్లు వేసి నీటి నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటినీ ఎత్తిపోసే అవకాశముందని అన్నారు. వర్షాలు లేకపోవడంతో గోదావరి పరిహాక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాలువలు నీరు లేక ఎండిపోయి రైతులు నారు మడులు అలికే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ సర్కార్‌తో కలిసి స్థానిక శాసనసభ్యుడు శ్రీధర్ బాబు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నీరు లేక ఎండిపోతున్న దృశ్యం కనబడుతుందన్నారు. భూగర్భ జలాలు వట్టిపోయాయని, మత్స్య సంపదకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. హరీష్ రావు చెప్పినట్టు గోదావరిలో ప్రస్తుతం ఉన్న నీటిని కన్నెపెళ్లి మోటర్ల ద్వారా వాడుకోవచ్చని, వాటిని వినియోగిస్తే తెలంగాణలోని సుమారు 15 జిల్లాలకు నీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి మోటర్లు ఆన్ చేసి నడిపించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు మోహన్ రెడ్డి ఉన్నారు.