హనుమకొండ, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ‘ప్రజా పా లన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతున్నది. గ్రామసభలు, వార్డు సభలు, డివిజన్ సభలకు హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా అభివృద్ధి పనులు చేపట్టడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రజా పా లన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు, డివిజన్ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది.
రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం మేరకు ఈ సభలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇం డ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలపై ప్రజలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీశారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డిని సభల్లో ప్రజలు నిలదీశారు. అభివృద్ధి పనులను ఎందుకు చేయడంలేదని అడిగారు. స్థానిక సమస్యలు వినకుండానే వెళ్లిపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రజా సమస్యలు వినలేనప్పుడు డివిజన్ సభలు, వార్డు సభలు, గ్రామ సభలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజల నిలదీతలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కంగుతిన్నారు.
రుణమాఫీ ఎక్కడైంది?
దంతాలపల్లి : దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామసభలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ను రైతులు నిలదీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా.. పలువురు రైతులు లేచి రుణమాఫీ ఎక్కడైంది..? రైతు బంధు ఏది…? అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఏవి? అని ఎమ్మెల్యేను నిలదీయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి కూర్చోబెట్టారు.
సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తరు?
స్టేషన్‌ఘన్‌పూర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భా గంగా జరిగిన గ్రామ సభల్లో సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులను ప్రజలు నిలదీశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్ గ్రామంలో సర్పంచ్ సంపత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మా ట్లాడుతుండగా పలువురు అడ్డుతగిలారు. తనకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలే దు? మేం ఓటు వేయలేదా? అని కలకోట యాదమ్మ ప్రశ్నించింది. బంజరు కాల్వలో చెట్లు తొలగించి, సీసీ లైనింగ్, పర్రె కాల్వ పనులు చేయించాకే పాంనూర్‌లో అడుగుపెడతానని గతంలో హామీ ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఎందుకు చేపట్టలేదని జాలిగపు రాజు అనే రైతు, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ఒగ్గు రాజు శ్రీ హరిని ప్రశ్నించారు. అలాగే పాంనూర్ నుంచి నమిలిగొండ వరకు కంకర పోసి మూడేళ్లు గడుస్తున్నా బీటీ వేయకపోవడం తో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. పాంనూర్‌లో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యార్డును ఏర్పాటు చేయొద్దని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల స్పందన
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగి స్థానికంగా పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తమ వరకు రాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూసుకుంటారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు గ్రామసభలు, వార్డు సభలకు వెళ్లారు.
కాగా, తమ ఇబ్బందులు, సమస్యలను చెప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ప్రజలు భావించి, ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు అర్హతఉన్నా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను ముందుగానే ఊహించిన కొందరు ఎమ్మెల్యేలు గ్రామ సభలకు దూరంగా ఉన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల డిమాండ్లు నెరవేర్చకపోవడంతో మళ్లీ అడుగుతారని కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టడం, సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజల్లోకి వెళ్లడానికి ఇబ్బందులున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు ప్రస్తావన లేకుండా ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టడం సరికాదని అంటున్నారు.
రైతు భరోసా.. ఇస్తరా? ఎగ్గొడతరా?
లింగాలఘనపురం : జనగామ జిల్లా లింగాలఘనపురంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పలు సమస్యలపై గ్రామస్తులు అధికారులను నిలదీయగా, సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. సర్పంచ్ ఎడ్ల లావణ్యారాజు అధ్యక్షతన గ్రామ సభ ప్రారంభం కాగానే ప్రజలు అడ్డుకున్నారు. ఆరు గ్యారెంటీలపై అధికారులను నిలదీశారు. రైతు భరోసా ఎకరం లోపు ఉన్న వారికే వేశారని, అదీ ఒకటే విడత ఇచ్చారని, వాస్తవానికి రైతులకు 5 విడతలుగా నిధులు జమ కావాల్సి ఉందని ఏదునూరి వీరన్న, కేమిడి వెంకటేశ్, గట్టగల్ల శ్రీహరి,బెజ్జం చంద్రయ్య, కేలపు లక్ష్మీనారాయణ, పుల్కరం ఉప్పలయ్య, పోరెడ్డి ఎల్లారెడ్డి, శోభ నిలదీశారు. అసలు రైతు భరోసా వేస్తరా..? ఎగ్గొడతరా? పింఛన్ల పెంపు ఏమైంది?, తులం బంగారం పథకం ఎక్కడికి పోయింది? స్కూటీలు ఏమయ్యాయి? మహిళలకు రూ.2500 ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ప్రగతి గ్రామసభ ఎందుకు.. బహిష్కరించాలని సర్పంచ్ ఎడ్ల లావణ్యారాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. గ్రామసభ గందరగోళంగా సాగింది.
మల్హర్‌లో బీఆర్ఎస్ నాయకుడి ముందస్తు అరెస్టు
మల్హర్ : మల్హర్ మండలం ఆన్సాన్పల్లి గ్రామానికి చెందిన బానోత్ రాజునాయక్(ఢిల్లీ రాజు) కొయ్యూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్సాన్పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు బయలుదేరే సమయంలో కొయ్యూరు పోలీసులు వచ్చి తనను బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కొని ఆన్సాన్పల్లి గ్రామం నుంచి భూపాలపల్లి పట్టణం వైపు పోలీస్ వాహనంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. మూడు గంటలపాటు కాలయాపన చేసి, గ్రామసభ పూర్తయింది.. ఇక నీవు నీ పనులు చేసుకో అంటూ విడిచిపెట్టినట్లు వాపోయాడు.
ఏడాది గడిచినా పంట నష్టమేదీ?
ఏటూరునాగారం : ఏటూరునాగారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ శ్రీలత అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రిలక్ష్మీ నర్సింహారావు రైతుల పక్షాన ధ్వజమెత్తారు. గతేడాది రబీ సీజన్లో ప్రకృతి వైపరీత్యానికి రైతులకు జరిగిన నష్టంపై ప్రభుత్వం ఎకరాకు ప్రకటించి రూ.10వేలు నేటికీ అందడం లేదని, రైతు భరోసా కూడా సకాలంలో పడడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు రైతులకు రూ.10 వేలు చొప్పున రైతుబంధు ఇచ్చారని అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నందున వెంటనే ఇచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉప్పుగల్లులో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
జఫర్‌గఢ్ : జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లులో జరిగే గ్రామసభకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వస్తున్నారనే సమాచారంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాయిని నరేశ్‌గౌడ్, మండల జాయింట్ సెక్రటరీ పులి ధనుంజయ్, మండల నాయకుడు గోలీ అన్నారెడ్డి అదుపులోకి తీసుకున్నారు.
విద్యుత్ ఆర్టిజన్ల వంటావార్పు
నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 2: ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ కార్యాలయాల ఎదుట గురువారం ఆర్టిజన్లు వంటావార్పు చేశారు. ఆర్టిజన్, అన్మ్యాన్డ్ కార్మికుల కన్వర్షన్, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలుకు టీవీఏఈ జే ఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సమ్మె కార్యాచరణలో భాగంగా ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రా ణాలకు తెగించి సంస్థ కోసం పనిచేస్తున్న కార్మికు లు కన్వర్షన్ సాధించడానికి అర్హులన్నారు. యాజమాన్యం సమస్యలు పరిషరించకపోతే ఈ నెల 7న ఎన్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద చేపట్టే మహాధర్నా ను కార్మికులు విజయవంతం చేయడంతో పాటు 8 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆందోళనకు టీఆర్వీకేఎస్, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్, పవర్ డిప్లొమా అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు.