కాజీపేట, అక్టోబర్ 21 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు దాదాపు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు ఎవ్వరైనా విజయం నాదేనని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన శనివారం పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్చకులు అయినవోలు ప్రవీణ్‌కుమార్ శర్మ నేత్వత్వంలో చీఫ్‌విప్‌ను అమ్మవారి శేష వస్ర్తాలతో సన్మానించి, ఆశీర్వాదం అందజేశారు. అనంతరం కాజీపేట చౌరస్తా సమీపంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథానికి ఆయన శనివారం కొబ్బరికాయ కొట్టి, రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజా ఆశీర్వాద ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల్లో తిరుగుతూ తెలంగాణ పథకాలు, నియోజకవర్గ పరిధిలో తాను చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను పంపిణీ చేశారు. పథకాలను వివరిస్తూ వెళ్లారు. వినయన్న వెంట తామంతా ఉన్నామంటూ వర్తక, వ్యాపారులు, ప్రజలు భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లల్లో అన్ని వర్గాలకు అండగా నిలిచిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో నియోజక వర్గానికి రూ.5 కోట్ల నిధులు రాకపోయేదన్నారు. నేడు తెలంగాణ పాలనలో నియోజక వర్గంలోని ఒక్కో డివిజన్‌కు రూ.20 నుంచి రూ.30 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాజీపేట ఫాతిమా బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సమాంతర బ్రిడ్జి నిర్మించేలా కృషి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కావాలనే రైల్వే ట్రాక్‌లపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా తిప్పిస్తోందన్నారు. అందుకే సమాంతర బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. రహదారిపై భారీ కల్వర్టు, స్థానికంగా కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, పార్కులను అభివృద్ధి చేశామన్నారు.
కరోనా కష్టకాలంలో, వర్షాలు పడినప్పుడు గుర్తుకు రాని ప్రజలు ఎన్నికలు రావడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓట్ల కోసం వస్తున్నారన్నారు. అప్పుడు గుర్తుకురాని ప్రజలను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆ పార్టీలు రైతులు, కార్మికులు, ఉద్యోగులకు తీరని అన్యాయం చేశాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన కాంగ్రెస్‌కు, నిత్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ కోరారు. స్థానికంగా నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాలను పంచుకునే తనను ఎన్నికల్లో ఆశీర్వదించారని విజ్ఞప్తి చేశారు. కేవలం ఓట్లప్పుడు మాత్రమే వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దన్నారు. అన్ని వేళలా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుంచు కృష్ణ, కాటపురం రాజు, మిట్లపల్లి రవీందర్, బోదరికోట రంజిత్, మర్యాల కృష్ణ, బరిగెల వినయ్, శివశంకర్, నాగవెళ్లి శ్రీధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.