Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త నిక్ జోనస్ సోదరి మాయా కిబెల్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధి అయిన విల్సన్ వ్యాధితో బాధపడుతున్న మాయా కిబెల్, చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే కావడం కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. విల్సన్ వ్యాధి అనేది శరీరంలో రాగి (కాపర్) అధికంగా పేరుకుపోయే అరుదైన జన్యుపరమైన సమస్య. ఈ కారణంగా కాలేయం, మెదడు వంటి ముఖ్య అవయవాలపై ప్రభావం పడుతుంది. క్రమంగా గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. దీంతో రోగి ఆరోగ్యం మరింత విషమించి చివరికి మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఈ వ్యాధితో చాలా కాలంగా పోరాడుతున్న మాయా కిబెల్ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆరోగ్యం క్షీణించడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని మాయా తల్లి కియోకో కిబెల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ఈ వార్తను పంచుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మాయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా ధైర్యంగా పోరాడింది. కానీ చివరికి ఆమె శరీరం సహకరించలేదు” అని ఆమె తెలిపారు. గత కొన్ని నెలలుగా మాయా తీవ్రమైన నొప్పి, బాధలను ఎదుర్కొంటూ ఉండేదని, చాలా సార్లు నిద్రపోయే వరకు ఏడుస్తూ ఉండేదని కూడా భావోద్వేగంతో పేర్కొన్నారు.
మాయా కిబెల్ అకాల మరణం నిక్ జోనాస్‌ను తీవ్రంగా కలచివేసింది. తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “ఆమె ఇప్పుడు మనతో భౌతికంగా లేకపోయినా, ఆమెతో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు ఈ విషాద వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రియాంక చోప్రా కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మొత్తానికి, చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో పోరాడుతూ మాయా కిబెల్ ప్రాణాలు కోల్పోవడం నిక్ జోనాస్ కుటుంబంతో పాటు అభిమానులను కూడా తీవ్ర విషాదంలో ముంచేసింది.