రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో జనం తిరగబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు శుక్రవారం నిరసనలు, నిలదీతలతో కొనసాగాయి. ప్రభుత్వ పథకాలు అనర్హులకే వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులమైనా తమకు ఎందుకు రాలేదని మండిపడ్డారు. పలు చోట్ల పేదలకు పథకాల లిస్టులో చోటుదక్కలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించగా, వారితో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడక్కడా గ్రామ సభలు రణరంగాన్ని తలపించాయి. దీంతో పోలీసు పహారా మధ్య నిర్వహించారు. తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించడంపై స్థానికులు భగ్గుమన్నారు.
కాగా, భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, ఆయన కొడుకు పేర్లు చదవడంతో గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్లు లేనివారిని పక్కనబెట్టి అన్ని ఉన్నోళ్లకు ఇచ్చుడేందంటూ నిలదీయ డంతో సమాధానం చెప్పలేకపోయారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఎస్సైకి ఆత్మీయ భరోసాలో పేరు రావడంతో గ్రామస్తులు గొడవకు దిగారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లే అధికారులు లిస్టు తయారు చేశారని
ఆరోపించారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 24
టేకుమట్ల, జనవరి24: నేను ఇల్లు అమ్మి ఇద్దరి బిడ్డల పెండ్లి చేసిన. అప్పు లు తీర్చడం కోసం గోదావరిఖనిలో జీతం ఉండడానికి పోయిన. నాకు గుంట భూ మి(ఇల్లు అడుగు) మాత్రమే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు కావాలని, ఇందరమ్మ ఆత్మీయ భరోసాలో రూ. 12000 కావాలని దరఖాస్తు పెట్టకున్న. నా పేరు ఎండ్ల రాలే. ఎందుకు రాలేదని అడిగితే మళ్ల దరఖాస్తు ఇయ్యమంటున్నరు. ఎకరాల కొద్ది భూములు ఉన్నోళ్ల పేర్లు ఇండ్ల లిస్ట్‌లో వచ్చినయ్. అప్పులు తీర్చాలనే నేను వలస పోయిన. మళ్ల ఉపాధి పని ఎప్పుడు అచ్చి చేయాలే. జిరాక్స్‌లకు, బస్సు కిరాయిలకు పైసలు పెట్టుకుని లాస్ అయిన. అధికారులు నా పరిస్థితి గుర్తించి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తే ఊర్లోకి అచ్చి నా కొడుకు లగ్గం చేయాలని అనుకుంటాన. సారూ.. మీరే దయ చూపాలె.
– రామగిరి సదానందం, పెద్దంపల్లి, టేకుమట్ల, జయశంకర్ భూపాలపల్లి
దంతాలపల్లి, జనవరి 24 : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామసభలో శుక్రవారం మహిళ అస్వస్థతకు గురైంది. గ్రామసభ నిర్వహిస్తుండగా ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకు నేందుకు వచ్చిన కొంపెల్లి మమ త అస్వస్థతకు గురైంది. చికిత్స అం దించాల్సిన వైద్య సిబ్బంది అందుబాటు లో లేకపోవడంతో స్థానికులు దంతాలపల్లిలోని దవాఖానకు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడ్డారు.
బయ్యారం: నా పేరు మేఖ కాంతమ్మ. మాది పేద కుటుంబం. ప్రజాపాలన లో ఇంటి కో సం దరఖాస్తు చేసుకున్న. సర్వే కోసం ఇంటికి వచ్చిన అధికారులు మట్టి గోడలు, పెంకు ల ఇల్లును ఫొటో తీసుకున్నారు. ఇక ఇల్లు వస్తుదని అనుకున్న. పిల్లలు లేని నాకు ఇల్లు వస్తే అనారోగ్యంతో ఉన్న భర్తతో కలిసి అందులో ఉందామనుకున్నా. నడవలేని స్థితి, ఇబ్బందిగానైనా గ్రామసభకు వచ్చిన. నా పేరు వస్తదని చివరి వరకూ ఎదురు చూసిన. కానీ పేరు రాకపోవడంతో ఎంతో ఆవేదనగా ఉన్నది. ఏంచేద్దాం.. నిరాశతో పోతాన..
-కాంతమ్మ, వృద్ధురాలు, బయ్యారం