వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ పెద్దమనస్సుతో ‘ఆర్టీసీ విలీనం’పై నిర్ణయం తీసుకున్నా గవర్నర్ తమిళిసై మాత్రం కాలయాపన చేస్తూ బిల్లు ఆమోదానికి మోకాలడ్డడంపై కార్మికులు గరంగరమవుతున్నారు. ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలకమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించకపోవడంపై కన్నెర్రజేస్తున్నారు. ఈమేరకు టీఎంయూ సహా పలు సంఘాల పిలుపుమేరకు శనివారం వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల ఎదుట నిరసనలు మిన్నంటాయి. ఉదయం 6 నుంచి 8గంటల వరకు డ్రైవర్లు, కండక్టర్లు సహా ఇతర కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించి గేట్ వద్ద బైఠాయించడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తమిళిసైకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి వెంటనే బిల్లుకు ఆమోదం తెలుపాలని డిమాండ్ చేసిన కార్మికులు అవసరమైతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈమేరకు శనివారం వరంగల్ రీజియన్ పరిధిలోని హనుమకొండ, వరంగల్-1, వరంగల్-2, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి డిపోల వద్ద కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఉదయం రెండు గంటల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించా రు. దీంతో బస్సులు రోడ్డెక్కలేదు. పలు సంఘాలు ఉదయం 8 గంటల తర్వాత కూడా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆర్టీసీ విలీన బిల్లుకు తమిళిసై వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. న్యాయసలహా పేరుతో కాలయాపన చేయడం తగదని మండిపడ్డారు. తమ కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. వెంటనే ఆమోదించాలని లేకపోతే ఆర్టీసీ కార్మికులంతా కలిసి అవసరమైతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.