హనుమకొండ : విలీనం, విమోచన పేరుతో చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోమని సీపీఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి నున్న అప్పారావు హెచ్చరించారు. సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ గ్రేటర్ వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విద్రోహదినంగా జరపాలని పార్టీ రాష్ర్ట కమిటీ పిలుపులోభాగంగా బుధవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణలో జరిగింది విలీనం, విమోచన కాదని, ముమ్మాటికీ విద్రోహమేనని అప్పారావు అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజు చేస్తున్నపాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గ్రామ,గ్రామాన లక్షలాది ప్రజలు తిరుగుబాటు చేసినట్లు కానీ నేడు రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం విలీనం, విమోచన పేరుతో చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, వాస్తవాలను ప్రజలకు రాబోవు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాధ పోరాటం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు శంకర్, సుమన్, నరేష్ పాల్గొన్నారు.