హనుమకొండ చౌరస్తా : నల్గొండ జిల్లాలోని నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి ( Principal Rupa Reddy ) దారుణ హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ హనుమకొండ జిల్లా అన్అయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ ( Rally ) నిర్వహించారు.
ఏకశిలా పార్క్ నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో హడుప్సా సభ్య పాఠశాలలకు చెందిన కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమ ప్రారంభంలో రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ర్యాలీ అనంతరం హడుప్సా ప్రతినిధులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులకు తగిన శిక్ష పడేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హడుప్సా అధ్యక్షుడు తక్కళ్లపల్లి బుచ్చిబాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోష్‌రెడ్డి, ట్రెజరర్ డి.శంకర్, చీఫ్ అడ్వైజర్లు జనార్ధన్, వేణుమాధవ్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్‌రావు, జాయింట్ సెక్రటరీ మధుకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రామారావు, వెంకట్‌రెడ్డి, ఏ.ఎం.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.