ఎంత ఆదర్శంగా, ఎంత అద్భుతంగా సిరిసిల్ల తయారైందో.. బిఫోర్ కేటీఆర్… ఆఫ్టర్ కేటీఆర్ ఏందో.. అక్కడి ప్రజలను అడిగి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలి. చేనేత కార్మికులకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో? మానేరు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అద్భుతమైన పంటలు ఎట్లా పండినయో రేవంత్‌రెడ్డి చూసి నేర్చుకోవాలి. -హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూచించారు. కేటీఆర్ రాకముందు సిరిసిల్ల ఎట్లుండే.. కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా మారిందో అక్కడి ప్రజలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు. ఎంత ఆదర్శంగా, ఎంత అద్భుతంగా సిరిసిల్ల తయారైందో.. బిఫోర్ కేటీఆర్… ఆఫ్టర్ కేటీఆర్ ఏందో.. ఒక్కసారి సిరిసిల్ల ప్రజలను అడుగాలని, అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు. నాలుగు వేల మంది పోలీసులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దండయాత్ర చేయడానికి సిరిసిల్ల ఏమైనా శత్రు రాజ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తంచేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన బుధవారం సనత్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనపై తనదైన ైస్టెల్లో చురకలంటించారు. ‘ఒక ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయాలి.
ఈయన దండయాత్రకు పోతడట. సిరిసిల్ల ఏమైనా శత్రు రాజ్యమా? యెనకట రాజులు పక్క దేశం మీద దండయాత్ర చేస్తుండేవాళ్లు. సిరిసిల్ల తెలంగాణలో లేదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నాలుగు వేల మంది పోలీసులు తెల్లవారుజామున 4 గంటల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని మండిపడ్డారు. కొంతమంది గూండాలనో, కార్యకర్తలనో సివిల్ డ్రెస్‌లో పోలీసులనో పెట్టుకొని పోయినంత మాత్రాన సిరిసిల్ల ప్రజల తలరాతలు మారవని వ్యాఖ్యానించారు.
అక్కడున్న రైతులకు కాశేశ్వరం జలాలు, మానేరు మీద చెక్‌డ్యామ్‌లు వచ్చాయంటే, సిరిసిల్ల మున్సిపాలిటీ ఆదర్శంగా అభివృద్ధి జరిగిందంటే దాని వెనుక కేటీఆర్ కృషి ఉన్నదని స్పష్టంచేశారు. నిజంగా ప్రజల మనసు గెలువాలంటే తాము చేసిన దానికంటే ఎక్కువ పని చేసి చూపించాలని హితవు చెప్పారు. చేనేత కార్మికులకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో? మానేరు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అద్భుతమైన పంటలు ఎట్లా పండినయో రేవంత్‌రెడ్డి చూసి నేర్చుకోవాలని సూచించారు.
నిరుద్యోగులపై లాఠీచార్జ్‌లు
ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్‌నగర్ చౌరస్తాలో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతో నాటకాలు ఆడించిన కాంగ్రెస్, తీరా అధికారంలోకి వచ్చాక 16 వేల ఉద్యోగాలే భర్తీ చేశామని అసెంబ్లీలో ఒప్పుకొన్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తమ భవిష్యత్తు కోసం నోటిఫికేషన్లు అడిగిన నిరుద్యోగ యువతపై దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్లలో రక్తం వచ్చేలా లాఠీచార్జ్ చేయిస్తున్నారని, ఆడపిల్లలని కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
యుద్ధ ప్రాతిపదికన ఓటరు నమోదు కార్యక్రమం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో సనత్‌నగర్ నుంచే ప్రచారం ప్రారంభించి ఎమ్మెల్సీ వాణీదేవిని గెలిపించుకున్నామని, అదే సెంటిమెంట్‌తో ఈసారి కూడా ఇకడి నుంచే బోణీ కొట్టి మళ్లీ భారీ విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.