నగరంలో గణనాథుల నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు, ట్యాంక్ బండ్ తీరం వ్యర్థాల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో కోట్లు విలువ చేసే స్రాప్ దళారుల చేతుల్లోకి మారుతోంది. నిమజ్జనం అనంతరం భారీగా మిగిలిపోతున్న ఇనుప రాడ్లు, వైర్లు, అల్యూమినియం ఫ్రేమ్లు, ఇతర మెటల్ స్రాప్ ను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, నిబంధనల ప్రకారం బహిరంగ వేలం (టెండర్లు) వేయాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించి చోద్యం చూస్తున్నాయి. రెండు శాఖల మధ్య సరైన సమన్వయం లేక కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : మహానగరంలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భారీ ఆకారాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తోపాటు భారీ ఉకు కడ్డీలు, గ్రిడ్లు, కలప, అల్యూమినియం సామగ్రిని ఉపయోగించి భారీ విగ్రహాలను తయారు చేస్తారు. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్ వంటి 38 ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో లక్షలాది విగ్రహాలు నీటిలో కలుస్తాయి. నిమజ్జనం ముగిసిన మరుసటి రోజు నుంచి కేవలం మొకుబడిగా చెత్తాచెదారం, పూజా సామాగ్రిని మాత్రమే తొలగిస్తున్న సిబ్బంది, లోహ వ్యర్థాల పట్ల మాత్రం దృష్టి పెట్టడం లేదు.
సాధారణంగా ప్రభుత్వ ఆస్తులు, ఉత్సవాల ద్వారా వెలువడే స్రాప్ను బహిరంగ వేలం ద్వారా విక్రయించి ఆదాయంగా మార్చుకోవాలి. అయితే, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటివరకు మెటల్ స్రాప్ తొలగింపునకు గానీ, దాని అమ్మకాలకు గానీ ఎలాంటి ముందస్తు టెండర్లు పిలవలేదు. ఏటా ఉత్సవాలు ముగిసిన వారం రోజుల పాటు ఇదే అదునుగా భావించే స్థానిక స్రాప్ వ్యాపారులు, అసాంఘిక శక్తులు రాత్రి సమయాల్లో జేసీబీల సహాయంతో, కాచిగూడ, భోలక్ పూర్, చికడపల్లి ప్రాంతాల దళారులతో కుమ్మకై టన్నుల కొద్దీ మెటల్ స్రాప్ను తరలించుకుపోతున్నారు. అయినా అధికార యంత్రాంగం దళారులతో చేతులు కలిపినట్లుగా చూసిచూడనట్లుగా వ్యవహారిస్తోంది.
ఇది మా పరిధి కాదంటే, మాది కాదంటూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో మారెట్లో టన్నుల కొద్దీ ఉండే ఇనుము, అల్యూమినియం రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఈ వ్యర్థాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం ప్రైవేట్ వ్యక్తులపాలు అవుతోంది. కేవలం మెటల్ మాత్రమే కాకుండా, విగ్రహాల తయారీలో వాడిన రసాయన పూతలు కలిగిన లోహ భాగాలు సరైన సమయంలో తొలగించకపోవడం వల్ల నీటి నాణ్యత మరింత క్షీణించే ప్రమాదం కూడా ఉంది. ఉన్నతాధికారుల ప్రమే యం లేకుండా ఇంజనీరింగ్లో పనిచేసే కొంద రు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ వ్యర్థాలు భారీగా గిట్టుబాటు అయినట్లుగా తెలిసింది. అందుకే టెండర్ల విషయంలో అధికారులు రాజీపడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.